సంప్రదాయ పద్ధతిలో టీ చేసుకోవడం తగ్గింది. వేడి నీళ్లలో ఓ టీ బ్యాగు పడేసి, కాస్త పంచదార వేసుకుని తాగేసే పద్ధతి పెరిగిపోయింది. గ్రీన్ టీ, బ్లాక్ టీ... ఇలా చాలా రకాల టీ బ్యాగులు దొరుకుతున్నాయి. వాటిని వాడేశాక వేస్టుగా పడేసేవాళ్లే అధికం. నిజానికి అవి వాడేసినవే అయిన వాటిలో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. ఇంట్లో రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. 


మొండి జిడ్డు వదిలిపోతుంది
కొన్ని గిన్నెలకు పట్టిన జిడ్డు, నూనె ఎంత తోమినా వదలవు. అలాంటి వాటిని ఈ బ్యాగులతో రుద్దితే ఇట్టే పోతుంది. మరీ వదలని జిడ్డు అయితే ఆ గిన్నెలో వేడినీళ్లు వేసి వాడేసిన టీ బ్యాగులు పడేసి ఓ గంట పాటను నానబెట్టాలి. ఆ తరువాత తోమితే తళతళలాడుతాయి. 


స్ప్రేయర్‌లా...
వేడి నీళ్లలో ఈ టీబ్యాగును నానబెట్టాలి. అందులో కాస్త నిమ్మరసం కూడా వేయాలి. ఓ గంట తరువాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్ ఓవెన్ , స్టవ్... ఇలాంటివి క్లీన్ చేసేందుకు వాడుకోవచ్చు. 


వంటల్లో కూడా...
చికెన్, మటన్ వంటివి వండినప్పుడు అవి మెత్తగా ఉడికేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ సమయంలో అయిపోవాలంటే ఒక గిన్నెలో మాంసం వేసి వేడి నీళ్లు పోసి, టీ బ్యాగులు కూడా వేయాలి. ఒక గంటపాటూ అలా వదిలేయాలి. టీ ఆకుల్లో ఉండే టానిస్ అనే పదార్థం మాంసాన్ని మెత్తగా చేస్తుంది. దీనివల్ల వండే టైమ్ తగ్గుతుంది. 


అరోమాకు జతగా...
ఇంట్లో మంచి సువాసనలు వీచేందుకు చాలా మంది అరోమా ఆయిల్స్, ఉత్పత్తులు వాడుతుంటారు. వాడేసిన టీబ్యాగులను కూడా అలా ఉపయోగించవచ్చు. బ్యాగులు ఓపెన్ చేసి టీ ఆకులను ఎండబెట్టాలి. వీటిని అరోమా ఆయిల్స్‌కు జతచేసినా మంచి వాసన వస్తుంది. పుదీనా, దాల్చిన చెక్క, లెమన్ గ్రాస్ లాగే టీ ఆకులు కూడా దుర్వాసనను దూరం చేస్తాయి. 


తేయాకుల మిశ్రమం
టీ బ్యాగుల్లో ఉండేది  వివిధ రకాల తేయాకులే. వాటికి కాస్త అదనపు పోషకాలు చేర్చి అమ్ముతారు. అస్సామ్ తేయాకు, చైనా తేయాకు, కంబోడియా తేయాకు ప్రసిద్ధమైనవి. బాగా పాపులర్ అయిన గ్రీన్ టీ వచ్చింది మాత్రం చైనా నుంచే.


Also read: ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయచ్చో తెలుసా? కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే


Also read: టైమ్ బ్యాడ్... పదహారు సెకన్ల పాటూ మాస్క్ తీసినందుకు రూ.2 లక్షల ఫైన్