మారుతున్న కాలం, పరిస్థితులకు తగ్గట్లుగా భారత్‌లో డిజిటల్ విద్యకు మరింత పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకోసం ‘వన్‌ క్లాస్‌- వన్‌ టీవీ ఛానల్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం విద్య బోధించేందుకు ఉన్న 12 చానళ్లను ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించారు. ఇది కనుక ఆచరణలోకి వస్తే ఇకపై అన్ని తరగతులకూ ప్రాంతీయ భాషలో ఒకేసారి డిజిటల్‌ విద్యాబోధన జరుగుతుందని భావిస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియోలు, డిజిటల్ టీచర్ల ద్వారా అన్ని భాషల్లో హై క్వాలిటీతో కూడిన ఇ-కంటెంట్‌ను అందిస్తామని నిర్మల సీతారామన్ వివరించారు.


అయితే దేశంలో ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు 12 చానళ్ల ద్వారా మాత్రమే డిజిటల్‌ తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క టీ శాట్ అనే ఛానల్ ద్వారా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో రోజుకు రెండు, మూడు తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఛానళ్ల సంఖ్యను 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 200కు పెంచుతామని ప్రకటించడంతో ఈ సమస్య తీరిపోయే అవకాశం ఉంచవచ్చని భావిస్తున్నారు. డిజిటల్‌ తరగతులకు స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ బోర్డు కూడా ఉండాలి. ఇందుకు ఒక్కో బోర్డుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 


డిజిటల్ యూనివర్సిటీ కూడా..
డిజిటల్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామని నిర్మల ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు వారి ఇంటి వద్దకే ప్రపంచస్థాయి విద్యను అందిస్తామని నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. వేర్వేరు ప్రాంతీయ భాషలు, ఐసీటీ ఫార్మట్స్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 


వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పు.. కమిటీ
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్‌ను సవరించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త పాఠ్యాంశాల్లో జీరో బడ్జెట్ వ్యవసాయం, సహజ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, వాల్యూ అండ్ మేనేజ్మెంట్ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నట్లు తెలిపారు. సిలబస్ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించనున్నారు.


ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.