ప్తులు చనిపోతే.. స్మశానంలో ఖననం చేయడం లేదా దహనం చేయడం వంటివి చేస్తారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత మళ్లీ అటువైపు వెళ్లరు. కానీ, మెక్సికోలోని కాంపెచే రాష్ట్ర ప్రజలు అలా చేయరు. చనిపోయిన తమ ఆప్తులను అలా స్మశానంలో వదిలేయడానికి ఇష్టపడరు. ఏటా వారి ఆస్థికలు (ఎముకలు) బయటకు తీసి.. శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని ఒక బాక్సులో పెట్టి స్మశానంలోనే భద్రంగా ఉంచుతారు. ప్రతి ఏటా వారు ఇలాగే చేస్తారు. ఇది చదువుతుంటనే మనసు ఏదోలా అనిపిస్తోంది కదూ. చనిపోయిన తన ఆప్తులను ఆ స్థితిలో చూస్తే.. మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ, వారు మాత్రం ఏం చేస్తారు. అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. కానీ, వారు దాన్ని కష్టంగా భావించరు. ఇష్టంగానే చేస్తారు.
 
కొత్తగా ఎవరైనా పోముచ్ స్మశానవాటికలో అడుగుపెడితే.. భయాందోళనలకు గురవ్వడం ఖాయం. అక్కడ ఎటుచూసిన జనాలు.. పుర్రెలు, ఎముకలను శుభ్రం చేస్తూ కనిపిస్తారు. మొదట్లో వారు చేస్తున్న పని చిత్రంగా అనిపిస్తుంది. అసలు విషయం తెలిసిన తర్వాత ఔరా.. ఇదెక్కడి సంప్రాదాయం అనిపిస్తుంది. అలా చేయడం వెనుక కారణం తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే, వీరు శుభ్రం చేసేది కేవలం అస్థికలు మాత్రమే. అంటే ఎముకులను మాత్రమే సేకరిస్తారు. ఇందుకు మూడేళ్ల వేచి చూస్తారు. అప్పటికి భౌతిక కాయం పూర్తిగా మట్టిలో కలిసిపోయి ఎముకులు మాత్రమే మిగులుతాయి. అప్పటివరకు వారు ఏటా సమాధి వద్దకు వెళ్లి దీపాలు వెలిగించి వచ్చేస్తారు. మూడేళ్ల తర్వాత.. సమాధి తవ్వి.. పుర్రె, ఎముకులను బయటకు తీస్తారు. 


ఇలా సేకరించిన ఎముకలను బ్రష్‌తో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆప్తుల పేర్లతో ఎంబ్రయిడరీ చేసిన వస్త్రాన్ని పెట్టెలో సర్దుతారు. ఆ తర్వాత ఎముకులు, పుర్రెను అందులో పెట్టేస్తారు. మళ్లీ ఏడాది తర్వాత ఆ వస్త్రాన్ని తీసేసి.. మరోసారి ఎముకులను శుభ్రం చేసి, కొత్త వస్త్రాన్ని పెట్టి బాక్సును స్మశానంలోనే వదిలేసి వెళ్తారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. వేర్వేరు ప్రాంతాల్లో నివసించేవారు సైతం ఏడాది కాగానే పోముచ్ స్మశానవాటికకు చేరుతారు. తమ ఆప్తుల అస్థికలను శుభ్రం చేసి వెళ్లిపోతారు. అక్కడ ఎవరైతే చనిపోతారో.. వారి వారసులు లేదా ఆత్మీయులే ఈ పని చేయాలి. అయితే, ఇటీవల కొందరు ఈ సాంప్రదాయన్ని కొనసాగించలేపోతున్నారు. దీంతో ఆ బాధ్యతను డాన్ వెనాన్సియో అనే వ్యక్తికి అప్పగించారు. అతడు దాన్ని ఉపాధిగా మార్చుకున్నాడు. సుమారు 20 ఏళ్ల నుంచి అతడు అస్థికలను శుభ్రం చేస్తున్నాడు. 


ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని అక్టోబర్ నెలలోనే జరుపుతారు. ఆ సమయంలోనే చనిపోయిన ఆప్తులు తమని చూడటానికి తిరిగి వస్తారనేది ప్రజల నమ్మకం. ఈ సాంప్రదాయన్ని అక్కడ ‘చూ బాక్’ అని అంటారు. సుమారు 150 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మాయన్ విశ్వోద్భవ శాస్త్రాన్ని విశ్వసిస్తారు. మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని ఈ శాస్త్రం చెబుతుంది. చనిపోయిన వ్యక్తులు పాతాళానికి వెళ్లి తిరిగి వస్తుంటారని అక్కడి ప్రజలు చెబుతారు. అస్థికలను శుభ్రం చేసిన తర్వాత పువ్వులు బాక్సుపై పెట్టి.. కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ సాంప్రదాయన్ని పాటిస్తున్నప్పుడు అంతా మౌనంగానే ఉంటారు. తమ ఆత్మీయులను తలచుకుంటారు. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగానికి గురవ్వుతారు. ఈ సాంప్రదాయం ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్కడి ప్రభుత్వం కూడా దాన్ని వారసత్వ సాంప్రదాయంగా గుర్తించింది.