Saw Fish in Karnataka | ఫొటో చూడగానే.. అయ్యో, పాపం ఆ చేప నోట్లోకి రంపాన్ని చొప్పించిన దుర్మార్గులు ఎవరని తిట్టుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ చేప నోట్లో ఎవరూ రంపం పెట్టలేదు. ఆ చేప రూపమే అంత!


ఈ చేపను ‘లార్జ్‌టూత్ సాఫిష్’ అని అంటారు. అంతరించిపోతున్న చేప జాతుత్లో చాలా అరుదైనది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని జాలర్ల వలలో ఈ చేప ప్రమాదవశాత్తు చిక్కుకుంది. 10 అడుగుల పొడవు, 250 కిలోల బరువున్న ఈ చేపను చూస్తే తప్పకుండా వెన్నులో వణుకుపుడుతోంది. నోటి నుంచి బయటకు వచ్చిన ఆ రంపం పండ్లతో ఆ చేప శత్రువులకు చుక్కలు చూపిస్తుంది. 


మాల్పే తీరంలో ‘సీ కెప్టెన్’ అనే మత్స్యకార బోటు వలల్లో ఈ చేప ప్రమాదవశాత్తు చిక్కుకుంది. అయితే, దాన్ని వెంటనే సముద్రంలోకి వదిలిపెట్టకుండా తీరానికి తరలించారు. అక్కడి నుంచి క్రేన్ సాయంతో మార్కెట్‌‌కు తీసుకెళ్లి వేలం వేశారు. దీన్ని మంగుళూరుకు చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. లార్జ్‌టూత్ సాఫిష్ ఐదు రంపపు చేప జాతుల్లో ఒకటి. వీటినే కార్పెంటర్ షార్క్ అని కూడా అంటారు. వీటిలో మూడు జాతులు రెడ్ లిస్టులో అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి. నివసించేందుకు సముద్రంలో అనుకూల వాతావరణం లేకపోవడం, అతిగా చేపలను వేటాడటం వల్ల వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.


Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!


 సముద్రం అడుగున ఎక్కువగా ఉండే ఈ చేపలు ఇటీవల నీటితలంపైకి వచ్చి వలలో చిక్కుకుంటున్నాయి. ఈ చేపలపై అవగాహన లేకపోవడం వల్ల మత్స్యకారులు వాటిని తిరిగి నీటిలోకి వదిలిపెట్టడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం.. సాఫిజ్ జనాభా సుమారు 90 శాతానికి క్షీణించినట్లు సమాచారం. కొందరు ఆ చేప రెక్కలు, రంపాలు, దంతాల కోసం వేటాడుతున్నారని, వాటిని ఔషదాల తయారీలో ఉపయోగిస్తున్నారని తెలసింది. అంతరించిపోతున్న ఈ చేప జాతులను పరిరక్షించడానికి ఇప్పటికే అంతర్జాతీయ వాణిజ్యంపై అంతర్జాతీయ వాణిజ్యం, ఇలాంటి చేపల వ్యాపారాన్ని పరిమితం చేసింది. రంపపు చేపలను వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972లోని షెడ్యూల్ 1 ప్రకారం వర్గీకరించారు. షెడ్యూల్ 1 కింద ఈ జాతుల వేటను నిషేధించారు. ఈ కోడ్‌ను ఉల్లంఘించినవారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. కఠిన శిక్ష విధిస్తారు.


Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?