Hair Growing on Tongue | ఉన్నట్టుండి అతడి నాలుకపై అకస్మాత్తుగా వెంటుకలు మొలవడం మొదలైంది. ఎందుకిలా జరిగిందా అని వైద్య పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఘటన మరెక్కడో కాదు, ఇండియాలోనే చోటుచేసుకుంది. 


నాలుక మీద మచ్చలు గురించి మీరు వినే ఉంటారు. కానీ, ఇదేంటీ కొత్తగా వెంటుకలు పెరగడం అని అనుకుంటున్నారా? అయితే, ఆ వ్యక్తికి ఏమైందో తెలుసుకోవల్సిందే. ‘జమా డెర్మటాలజీ’లో పేర్కొన్న వివరాలు ప్రకారం 50 ఏళ్ల ఓ వ్యక్తి తన నాలుక మీద చర్మంపై దట్టంగా జుట్టు పెరగడంతో హడలిపోయాడు. వెంటనే అతడు కేరళలోని కొచ్చిన్‌లోని మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రి వైద్యడిని సంప్రదించాడు.


వైద్య పరీక్షల్లో అతడు ‘లింగువా విల్లోసా నిగ్రా’ లేదా ‘బ్లాక్ హెయిర్ టంగ్-BHT’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్ గుర్తించాడు. అయితే, మొదటి నుంచి అతడికి ఈ సమస్య లేదు. ఈ వ్యాధి ఏర్పడటానికి మూడు నెలల ముందు అతడికి పక్షవాతం వచ్చింది. శరీరంలోని ఎడమ భాగంలోని అవయవాలు పనిచేయడం మానేశాయి. ఇది జరిగిన రెండు నెలల తర్వాత అతడి నాలుకపై జుట్టులాంటి మందపాటి కణజాలం పెరగడం ప్రారంభమైంది.


ఈ సమస్య వల్ల అతడు ఆహారం తినడం కష్టమైంది. ఆ నాలుకను పరీక్షించేప్పుడు దానిపై నల్లని ఫైబర్ వంటి కణజాలం కనిపించిందని, ఆహారం కూడా  అందులో చిక్కుకుందని వైద్యులు తెలిపారు. ఆ జుట్టు మధ్య పసుపువర్ణం చారలు ఉన్నాయన్నారు. నాలుకపై లాలాజలాన్ని పరిశీలించిన తర్వాత అతడు ‘BHT’తో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. నాలుక ఉపరితలంపై ఉండే చిన్న చిన్న కోన్ ఆకారపు గడ్డలు వెంటుకల తరహాలు కనిపిస్తాయి. ఇవి ఒక మిల్లీ మీటర్ పొడవు వరకు పెరుగుతాయి. వాటిని అలాగే వదిలేస్తే 18 మిల్లీ మీటర్లు వరకు పెరిగిపోతాయి.


కారణం ఏమిటీ?: పక్షవాతం వల్ల బాధితుడు నోరు కదపలేకపోయేవాడు. దీంతో లిక్విడ్ డైట్(ద్రవ పదార్థాలు) మాత్రమే తీసుకొనేవాడు. ఫలితంగా నాలుకపై క్రమేనా ఆహార పదార్థాలు పేరుకుపోయి ‘BHT’కి దారి తీసింది. నాలుక పొడిబారినా సరే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే, ఇవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. నల్లగానే కాకుండా పసుపు, పింక్ కలర్‌లో వెంటుకల తరహా కణజాలం నాలుకపై ఏర్పడుతుంది. 


నోరు పొడిబారే సమస్య ఉన్నా నాలుకపై జుట్టు ఏర్పడుతుంది. ఇవి ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నాలుకపై జుట్టు చాలా ప్రమాదకరమైన సమస్య. ఇది గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నోటి పరిశుభ్రత లేని వ్యక్తుల్లో కూడా ఇది ఏర్పడుతుంది. వైద్యులను ఆశ్రయించిన 20 రోజుల తర్వాత అతడి నాలుక మళ్లీ సాధారణ స్థితికి మారింది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొన్న వివరాల ప్రకారం కొన్ని మౌత్‌వాష్‌లు డెస్క్వామేషన్ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. దాని వల్ల BHT ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే నోటిని, నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం. 


Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?


ఈ కారణాలు వల్ల కూడా సమస్యలు వస్తాయ్: 
⦿ నోటిని శుభ్రంగా ఉంచకోకపోవడం. 
⦿ టంగ్ క్లీన్ చేయకపోవడం. 
⦿ కాఫీ, టీ, ఆల్కహాల్ లేదా పొగాకు ఉత్పత్తుల అధిక వినియోగం.
⦿ యాంటిబయాటిక్స్ తదితర మందుల వాడకం.
⦿ తల, మెడ రేడియేషన్ చికిత్స.
⦿ నోరు పొడిబారడం.
⦿ వృద్ధులలో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడుతుంది. 


Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..