Sleepmakers : ప్రస్తుతం ప్రజల జీవన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. పాత కాలపు రోజుల్లా ఇప్పటి పరిస్థితులు లేవు. నిదానమే ప్రదానం అనుకునే రోజులు పోయాయి. ఆలస్యం అమృతం విషం అనుకునే రోజులు వచ్చాయి. లేచిన దగ్గరనుంచి రోజూ ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. ఏ రంగంలో చూసినా విపరీతమైన పోటీ నెలకొంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే పరుగులు పెట్టక తప్పని పరిస్థితి. పైగా ఎక్కువ శాతం మంది శారీరక శ్రమలేని ఉద్యోగాలు చేస్తున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. అంతే కాకుండా ఉద్యోగాల్లో విపరీతమైన పని ఒత్తిడి.. వెరసి అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. జనాలను మానసిక రుగ్మతలు వేధిస్తున్నాయి. ఇది చైనాలో కూడా ఎక్కువగా జరుగుతోంది. 


996 వర్క్ కల్చర్
అక్కడ పుట్టుకొచ్చిన ‘996 వర్క్‌ కల్చర్‌’ (వారంలో ఆరు రోజులు.. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పని) యువతను నిద్రకు దూరం చేస్తోంది. దీంతో మానసిక సమస్యలు.. వైవాహిక ఒత్తిడి, నిత్య జీవితంలో ఒత్తిళ్లు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదన అనుభవిస్తున్నారు. ఈ సమస్యల కారణంగా నిద్రకు దూరం అవుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మానసిక ఒత్తిడిని పోగొట్టి జోలపాడి హాయిగా నిద్రపుచ్చేందుకు ఓ కొత్తరకమైన ఉద్యోగం ఇప్పుడు ఇక్కడ పుట్టుకొచ్చింది. ఆ వృత్తి పేరే ‘స్లీప్ మేకర్స్’.


కనీసం నిద్ర అవసరం
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సరిపడా నిద్రలేకపోతే.. నిస్సత్తువ, ఒత్తిడి, చిరాకు, ఏకాగ్రత లోపించటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా దీర్ఘకాలంలో బరువు పెరగడంతోపాటు బీపీ, షుగర్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   


గంటకు రూ.3 వేలు
చైనాలో వచ్చిన కొత్తతరం ఉద్యోగులు(స్లీప్ మేకర్స్) ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్న వారికి ఎమోషనల్‌గా సపోర్ట్‌ అందజేస్తారు. వారి బాధలు ఓపికగా వింటారు. ముచ్చట్లాడుతూ వారిలోని ఆందోళనను దూరం చేసేస్తారు. ఫలితంగా వారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఈ సేవలు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. స్లీప్‌మేకర్స్‌ గంటకు 260 యువాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ.3 వేలు) వసూలు చేస్తున్నారు. 996 వర్క్‌ కల్చర్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిలో ఎక్కువమంది యువతే ఉండడం గమనార్హం. వీరు తమ బాధలను స్లీప్‌మేకర్లతో చెప్పుకుంటూ సేద తీరుతుంటారు.   


సెవెన్ సెవెన్ 7 పాపులర్
ఇలాంటి సేవలు అందించే వాటిలో ‘సెవెన్‌ సెవెన్‌7’ అనే సంస్థ చాలా పాపులారిటీ సంపాదించుకుంది.  ఇది ఊహాత్మక బెడ్‌టైం స్టోరీలు చెప్తూ క్లయింట్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడీ వృత్తిని చాలామంది పార్ట్‌టైంగానూ ఎంచుకుంటూ రెండు చేతులా దండిగా సంపాదిస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత సమస్యలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపరు. వాటిని తమలో తామే దాచుకుని మదనపడుతూ నిద్రకు దూరం అవుతారు. ఇలాంటి వారికి ఈ స్లీప్‌మేకర్స్‌ చక్కని ఔషధంలా పనికొస్తున్నారు. తమ సమస్యలను వారి ముందు వెళ్లబోసుకుని గుండెలోని భారాన్ని దింపేసుకుంటూ హాయిగా నిద్రపోతున్నారు.
Also Read: Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో


లాభాల పంట
స్లీప్ మేకర్‌గా చేస్తున్న టావోజీ అనే అమ్మాయి మాట్లాడుతూ.. ‘‘చాలామంది తమకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఆ సమస్యలను తలచుకుని మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటి వారి సమస్యలను తాము శ్రద్ధగా విని వారి గుండె బరువును తగ్గించే ప్రయత్నం చేస్తాం. వారు కూడా సమస్యలు చెప్పుకున్నాక తేలికపడి హాయిగా నిద్రపోతారు.’’ అని చెప్పుకొచ్చారు.  ఇప్పుడీ వ్యాపారం చైనాలో మూడుపువ్వులు ఆరు కాయులుగా విస్తరిస్తోంది.  
Also Read: Viral News: బరువు 50 గ్రాములే, విలువ మాత్రం రూ.850 కోట్లు - ముగ్గురి అరెస్ట్, ఏమిటా పదార్థం?