Bihar : బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి  50 గ్రాముల అరుదైన కాలిఫోర్నియం రేడియోధార్మిక పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అంచనా. దీనిని ఏ రూపంలో ఉపయోగించాలో వెల్లడించలేదు. సీనియర్ పోలీసు అధికారుల బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ మాట్లాడుతూ.. జిల్లాలో కొందరు వ్యక్తులు విలువైన వస్తువును అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం నిందితులను గుర్తించి, వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో పాటు వారి వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లు, 50 గ్రాముల కాలిఫోర్నియం రేడియోధార్మిక పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేడియోధార్మిక పదార్థాన్ని పరీక్షించేందుకు ఐఐటీ మద్రాస్‌ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఇది గుజరాత్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 


వజ్రాల కంటే ఖరీదు  
ఒక గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని ఎస్పీ  స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియా రేడియోధార్మిక పదార్థపు విలువ దాదాపు రూ.850 కోట్లు ఉంటుందని వెల్లడించారు. దీనిని ప్రధానంగా అణుశక్తి ఉత్పత్తి, మెదడు క్యాన్సర్ చికిత్స, ఆయిల్ డ్రిల్లింగులలో ఉపయోగిస్తారని వెల్లడించారు.  బిహార్ ఎస్టీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్7, గోపాల్‌గంజ్ బీఐయూ, కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌ల సంయుక్త ఆపరేషన్లో భాగంగా దీనిని పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా భద్రతా బలగాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో 50 గ్రాముల కాలిఫోర్నియం, విలువైన రేడియోధార్మిక పదార్థాన్ని కనుగొన్నారు. వీరితో పాటు ముగ్గురు స్మగ్లర్లు కూడా పట్టుబడ్డారు. వారిలో ఒకరు ఉత్తర ప్రదేశ్ కి చెందినవారు కాగా, ఇద్దరు గోపాల్‌గంజ్‌కు చెందినవారు. అయితే ఇంటర్నెట్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. 1 గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు రూ.17 కోట్లు పలుకుతోంది.  


 
అలెర్టయిన పోలీసులు
అరెస్టయిన స్మగ్లర్ ఛోటాలాల్ ప్రసాద్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీనగర్ జిల్లా తమ్‌కుహి రామ్ పోలీస్ స్టేషన్ పర్సౌని గ్రామ నివాసి. చందన్ గుప్తా, చందన్ రామ్ అనే ఇద్దరు లైనర్లు గోపాల్‌గంజ్ పరిధికి చెందిన వారు. ఈ పదార్థాన్ని విక్రయించేందుకు ఈ ముగ్గురు చాలా నెలలుగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ క్రమంలో అప్రమత్తమైన సిట్, ఎస్ఓజీ, డీఐయూ స్థానిక కుచాయికోట్ పోలీస్ స్టేషన్‌ల బృందం నేతృత్వంలో సోదాలు నిర్వహించి వారిని పట్టుకుని విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వందలకోట్ల రూపాయల విలువైన రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియం రికవరీ కేసులో తదుపరి పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని సంప్రదించే పనిలో ఉన్నారు. గోపాల్‌గంజ్ ఎస్పీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి చెందిన ప్రత్యేక బృందాన్ని పిలిచింది. దీని స్మగ్లింగ్, హ్యాండ్లింగ్, బ్యాక్‌వర్డ్ ఫార్వర్డ్ లింకేజీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు.