Stanford Byers Center for Biodesign keen to partner with Telangana | హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. రాష్ట్రానికి పలు రంగాల్లో పెట్టుబడులతో పాటు సాంకేతిక సాయంపై సైతం పలు అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి తెలంగాణ ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని తాజాగా సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రతినిధుల టీమ్ సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ (Health Care)లో కొత్త ఆవిష్కరణలు, విద్య (Education), నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చించారు.


స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి తెలంగాణ ఆహ్వానం 
తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Young India Skills University), న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని ఆహ్వానించింది. అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఆ యూనివర్సిటీ ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే దానిపై సమావేశంలో ప్రతిపాదించారు. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశాలపై చర్చలు జరిగాయి. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను తెలంగాణలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వారితో షేర్ చేసుకున్నారు. 


స్టాన్‌ఫోర్డ్ ప్రతినిధులతో సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని వర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటన చేశారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తరఫున స్పష్టం చేశారు. 


తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు 
స్టాన్‌ఫోర్డ్ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రముఖ యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం వల్ల తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు పడతాయన్నారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు యూనివర్సిటీని భాగస్వామ్యం కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే తెలంగాణలో తాము ఆశించినట్లుగా స్కిల్స్ డెవెలప్మెంట్ లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం కేవలం రాష్ట్ర వృద్ధికే కాకుండా, ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. 


మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో తెలంగాణలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీల లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సహకారంతో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందన్నారు.