Bahadurpura MLA Mohd Mubeen detained by police | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  భారీ భద్రత బలగల నడుమ రాజేంద్రనగర్ లో శనివారం నాడు స్థలాన్ని కొలిచి, అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు.


ఎంఐఎం ఎమ్మెల్యే అరెస్ట్, పీఎస్ కు తరలింపు 
అక్రమ నిర్మాణాలను కుల్చివేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను బహదూర్ పుర ఎమ్మెల్యేని మహ్మద్ ముబీన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిర్మాణాలను కూల్చివేయవద్దని పోలీసులు, సిబ్బంది వాగ్వాదానికి దిగారు. రాజేంద్రనగర్ డిసిపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుండగా, అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ను పోలీసులు అరెస్ట్ చేసి, పీఎస్ కు తరలించారు. 


బహదూర్ పురలోని శాస్త్రిపురంలో Rukn-ud-daula Lake లో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, హెచ్ఎండిఏ ( హైడ్రా ) సిబ్బంది చర్యలు చేపట్టింది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ వరకు కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఏ అనుమతులు లేకుండా, ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇందుకోసం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున పోలీసులను అక్కడ మోహరించారు. అనంతరం భారీ భద్రత నడుమ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నగరంలో చెరువులు, చిన్న చిన్న నీటి కొలనులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించడం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎం, హెచ్ఎండీఏ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఆ సమయంలో కాలనీలో ఎవరిని కూడా బయటికి లోనికి రానియకుండా కట్టుదిట్టమైన భద్రతా బలగాలు అక్కడ మోహరించాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను, మీడియాను సైతం ఆ ప్రాంతంలోకి అనుమతించలేదని పోలీసులు, అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.