Harish Rao News: రుణమాఫీ అందని రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వాట్సాప్ హెల్ప్ లైన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. 8374852619 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సుమారు 72,000 పైచిలుకు దరఖాస్తులు ఉన్నాయని హరీష్ రావు వెల్లడించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తెలంగాణ భవన్ ఇంఛార్జ్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.


సీతారామ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు
సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హ‌రీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు. 30 వేల ఉద్యోగాల క‌థ లాంటిదే సీతారామ ప్రాజెక్టు క‌థ కూడా అని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ హ‌యాంలోనే 90 శాతం పూర్తయిందని.. కానీ మేమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన‌ట్లు కాంగ్రెస్ నేత‌లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ త‌న ఇష్టమైనదిగా రూపొందించారని.. అప్పుడే నిర్మించిన ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అప‌సోపాలు ప‌డుతుందని అన్నారు. 


గత పదేళ్లుగ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను త‌మ విజ‌యాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తంటాలు పడుతోందని అన్నారు. ఖ‌మ్మం జిల్లా క‌రవు బాధ‌లు తీర్చాల‌ని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ సంక‌ల్పించారని.. ప‌విత్రమైన ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామ‌చంద్రుల పేరే ఉండాల‌ని వారి పేరు నామ‌క‌రణం చేశారని గుర్తు చేశారు.