Khandev Fair In Narnur: దేవునికి మొక్కులు చెల్లించడం అంటే ముడుపు ఇవ్వడమే, లేక బంగారం ఇవ్వడమో కొన్ని చోట్ల కోళ్లు, మేకలు బలి ఇవ్వడమో మనం చూసుంటాం. కానీ ఆ ఆలయంలో మొక్కు చెల్లించడం అంటే నువ్వుల నూనె తాగాలి. ఆదివాసీ తెగలోనే ఓ మహిళ ఏకంగా 2 కిలోల నువ్వుల నూనె తాగి తమ ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకుంటారు. పుష్యమాసం వచ్చిందంటే చాలు అక్కడి ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు తమ దేవుళ్లను కొలుస్తుంటారు. ఈ తెగల్లోని తొడసం వంశీయులకు ఆరాధ్య దైవం ఖాందేవ్, పులి, ఏనుగు. ఏటా పుష్య మాసం సందర్భంగా ఈ వంశీయులు ఖాందేవ్ ఆలయంలో మహా పూజ నిర్వహించి నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లిస్తారు. తమ ఇష్ట దైవానికి ఖాందేవ్ కు వంశ ఆడపడుచు మూడేళ్ల పాటు 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లిస్తుంది. ఏటా పుష్య పౌర్ణమి రోజున మహా పూజ అనంతరం విశ్వశాంతి కోరుతూ ఈ తైల సేవనం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ప్రారంభమయ్యే ఖాందేవ్ జాతర.. వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి తొడసం వంశీయులు, ఆదివాసీలు భారీగా తరలివస్తారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించే తొడసం వంశీయుల 'ఖాందేవ్ జాతరపై ప్రత్యేక కథనం.
ఇదీ చరిత్ర
నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవ్ ఆలయంలో ఉన్న దైవం పులి. ఆలయం పక్కన ఉన్న 18 ప్రతిమలను ఖాందేవ్ గా, ఆ పక్కనే ఉన్న ఏనుగును కుల దైవంగా భావించి తొడసం వంశీయులు ఏటా పుష్యమాసంలో కొలుస్తుంటారు. ముందుగా పుష్య పౌర్ణమి రోజున మహాపూజ నిర్వహించాక ఆలయంలో విశ్వశాంతి కోరుతూ తొడసం వంశ ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లిస్తుంది. ఇలా మూడేళ్లకోసారి ఒకరు మొక్కు చెల్లించడం ఆనవాయితీ. ఈ పౌర్ణమి రోజున తొడసం వంశీయుల ఆడపడుచు మెస్రం నాగుబాయి 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు చెల్లించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కొద్దేపూర్ గ్రామానికి చెందిన తొడసం మారు - దేవుబాయి దంపతుల కూతురు నాగుబాయి. గతేడాది, ఈ ఏడాది రెండు సార్లు మొక్కు చెల్లించగా.. వచ్చే ఏడాది మొక్కు చెల్లించడంతో ఆమె మొక్కు పూర్తవుతుంది. అనంతరం మరో అడపడుచు మూడేళ్ల పాటు మొక్కును చెల్లిస్తుంది.
మొక్కు వెనుక నియమాలు
ఈ నూనె మొక్కుకు చాలా నియమాలున్నాయి. తొడసం వంశీయుల ఆడపడుచులు పుష్య మాసంలో నెలవంక కనిపించిన తరువాత తమ పంట పొలాల్లో పండించిన నువ్వులను గానుగతో స్వచ్ఛమైన నూనెను సేకరించి ఖాందేవ్ మొక్కు కోసం ఒక్కొక్కరి ఇంటి నుంచి కొంతగా తీసుకువస్తారు. అలా తీసుకొచ్చిన ఈ నువ్వుల నూనెను ముందుగా ఖాందేవ్, పులి, ఏనుగు, దేవతలకు చూపించి, కటోడ పూజారి ఆద్వర్యంలో నైవైద్యం పెట్టి, నూనె మొక్కు (తైలసేవనం) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తొడసం వంశంలో పుట్టిన ఆడపడుచు పెళ్లైన తరువాత ఇంటి పేరు మారినా ఆమె పుట్టిన వంశ ఆడపడుచుగానే మొక్కును చెల్లిస్తుంది. మహారాష్ట్రలోని కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి ఈసారి క్రతువు పూర్తి చేశారు.
ఆలయం వెనుక కథ
ఖాందేవ్ ఆలయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. పూర్వం 500 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో తొడసం వంశీయులు యుద్ధంలో విజయం సాధించి నార్నూర్ కు వచ్చి జాతర జరుపుకోగా అది పూర్వీకుల నుంచి తరతరాలుగా కొనసాగుతోందని తొడసం వంశీయులు తెలిపారు. ఏటా పుష్య మాసంలో నార్నూర్ ఖాందేవ్ ఆలయంలో మహాపూజ అనంతరం విశ్వశాంతి కోరుతూ నూనె మొక్కు చెల్లించడం, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, తమ పాడి పంటలు బాగా పండాలని, ఏ కష్టమొచ్చిన తమ ఖాందేవుడు ఆదుకుంటాడని నమ్మకంతో ఈ వంశీయులు, ఇతర ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దర్శించుకుంటున్నారు.
ఈ జాతర సందర్భంగా ఆయా ప్రాంతాల ఆదివాసీలు తరలివచ్చి తమ కొత్త కోడళ్లకు దైవాలను పరిచయం చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. దీన్ని ఆదివాసీలు 'భేటింగ్' అని అంటారు. తెల్లని చీరలను ధరించుకొని కొత్త కోడళ్లు ముందుగా వంశ పెద్దల్ని కలిసి ఆశీస్సులను పొంది.. ఖాందేవ్ ని దర్శించుకుంటారు. ఈ క్రమంలో వంశ ఆడపడుచులు 'రేలా రేలా' పాటలు పాడుతూ డోలు వాయిద్యాల మధ్య డేంసా నృత్యాలు చేస్తారు. అనంతరం ఖాందేవ్ వద్ద ఉన్న రెండు బల్లాలను కటోడ పూజారి భల్లా దేవ్ గా భావించి ఎత్తుకొని నృత్యాలు చేస్తూ పులి ఆలయంలోకీ వెళ్లి పెట్టి శాంతింపజేస్తారు. ఇలా తమ పూర్వీకుల విజయానికి ప్రతీకగా ఈ బల్లాలు, ఆయుధాలు పని చేశాయని వాటిని పూజిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇలా తొడసం వంశీయులు సాంప్రదాయ పూజలు చేసి 4 రోజుల పాటు ఈ ఆలయంలో ఉండి జాతరలో సందడి చేసి తిరిగి తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్తారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఈ నూనె మొక్కు కార్యక్రమం సంధర్భంగా ఖాందేవ్ ఆలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో తిరిగి బావిని పరిశీలించారు. ఆపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో పవిత్రమైనవని, ఆచారాలకు ప్రాణం పోస్తూ అడవి బిడ్డలు తమ దైవాలను భక్తి శ్రద్ధలతో కొలుస్తారని అన్నారు. వారం రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం కోసం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.