BRS And KTR Ready For General Elections 2024: లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) కసరత్తులో భాగంగా పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తి చేసిన గులాబీ పార్టీ (Brs)...ఇపుడు శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. వచ్చే నెల 10 తేదీ లోపు ఈ సమావేశాలు పూర్తి చేసేలా ప్రణాళికలు రెడీ చేసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలతో పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. షెడ్యూల్ విడుదలకు ముందే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు.


ప్రతి రోజు ఐదు నియోజకవర్గాలపై సమీక్ష
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు ముగియడంతో ఇపుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కేటీఆర్ దృష్టి పెట్టారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమావేశాల్లో సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ అసెంబ్లీ స్థానాలపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశాలన్నీ ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే జరగనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశాలకు పార్టీకి సంబంధించిన కీలకనేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు.  సమావేశాల నిర్వహణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తీసుకోనున్నారు. ఇవాళ్టీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, లోటుపాట్లు పై పూర్తిస్థాయి సమీక్ష జరపనున్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు, కార్యకర్తలతో  చర్చించనున్నారు.


సిట్టింగ్ లకు సీట్లు గ్యారెంటీనా ?


బీఆర్ఎస్ తరపున గెలుపొందిన తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు...వచ్చేఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మాజీ ఎంపీలు, అసెంబ్లీ  ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సిట్టింగ్ ల్లో కొందరికి కొంత మందికి ఇప్పటికే మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ సూచించినట్లు సమాచారం. మరికొందరిని కూడా పని చేసుకోవాలని నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి టికెట్లు ఇవ్వొద్దంటున్న శ్రేణులు


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, ప్రత్యర్థులు విజయానికి అనుకూలించిన పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరు, పార్టీపై ప్రజలకు ఉన్న అభిప్రాయం, నేతల బలాబలాలపై సుదీర్ఘంగా చర్చించున్నారు. సమావేశంలో వచ్చిన రిజల్ట్ ను బట్టి పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయనుంది.  తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి మళ్లీ టికెట్లు ఇవ్వవద్దని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి పాలయిన మంత్రులను మరో రకంగా ఉపయోగించుకోవడంపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.