వరంగల్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పర్యటనలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక జెడ్పీ ఛైర్ పర్సన్‌కు కరోనా నిర్ధారణ అయింది. హనుమకొండ జిల్లాలో మంత్రుల పర్యటన ముగియగానే పలువురు ప్రజాప్రతినిధులు కరోన బారిన పడ్డారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం పరకాల నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు. 


మిర్చి పంట పరిశీలనలో మంత్రులతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. అనంతరం మంత్రులతో పాటు హెలికాప్టర్‌లో వీరు హైదరాబాద్ వెళ్లారు. జ్వరం రావడంతో సాయంత్రం గండ్ర దంపతులు కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తాము ఐసోలేషన్‌లో ఉన్నామని, తమను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని గండ్ర దంపతులు సూచించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సైతం కొవిడ్ బారిన పడ్డారు. వీరితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇటీవల కరోనా సోకింది. 


తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు అధిక సంఖ్యలో కరోనా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తో పాటు 100 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరిండేంట్ తో పాటు భూపాలపల్లి ఎస్ఐ సైతం కరోనా బారిన పడ్డారు.


తెలంగాణలో కరోనా అప్‌డేట్స్.. 
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,07,904 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2983 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 7,14,639కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,88,105కి చేరింది.


Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు ! 


Also Read: Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ


Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి