Minister Errabelli: వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటు నుండి వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ప్రమాదాన్ని గమనించి వాహనం ఆపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి దగ్గరుండి తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారితో పాటు దవాఖానకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి గాయపడిన వారికి దగ్గరుండి వైద్యం చేయించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను తానే భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గాయపడిన 13 మంది యువకుల్లో కేవలం నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతావారు స్వల్పంగా గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం ఊకల్ శివారులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్తున్నారు. అదే దారిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించిన మంత్రి తన కాన్వాయ్ ను ఆపి కారు దిగొచ్చి బాధితులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ ట్రక్ మాట్లాడి అందులో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తన వాహనంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీరును పరిశీలించి గాయపడ్డవారికి భరోసా కల్పించారు. మంత్రి ఎర్రబెల్లి కారు ఆపి పరామర్శించడమే కాకుండా ఆస్పత్రి వరకు వచ్చి చికిత్సకు డబ్బులు కూడా ఇస్తానని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆయన వైఖరి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం, నలుగురు దుర్మరణం - ఇద్దరికి గాయాలు
రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఇద్దరూ అన్నదుమ్ములే కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకరు రైల్వే ట్రైనీ టీసీ కాగా.. ఇంకో వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వారిలో ఒకరు పెద్దవాడు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా రెండో వాడు హరికృష్ణ (23) సాప్ట్ వేర్ ఇంజినీర్. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. విషయం తెలిసిన ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్‌పర్తి ఎస్సై విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.
Also Read: బైక్ ను ఢీకొన్న బస్సు, బైకర్ మృతి - 12 కిలోమీటర్లు బండిని లాక్కెళ్లిన డ్రైవర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ హోటల్ నడుపుకుంటూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండో వాడు హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కందుగుల నుంచి తెల్లవారు జామున 5 గంటలకు టూవీలర్‌పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉదయం ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేరే వాహనం వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.