మెదక్‌ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు ఆటోను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇంకో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మణెమ్మ (60), బాల నర్సయ్య (65) అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు చెప్పారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ అనే వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.


ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మధ్యలో నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతానికి ఆటో చేరుకోగానే, వెనక నుంచి కారు ఢీకొంది. దీంతో కారు, ఆటో రెండూ రోడ్డు పక్కన గొయ్యిలోకి దూసుకుపోయాయి. అయితే, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.