Minister Errabelli Dayakar : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. జనంతో ఇట్టే కలిసిపోయే ఆయన.. ఆదివారం ఓ సరదా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం పర్యటించారు.  పాలకుర్తి నియోజకవర్గ పర్యటన అనంతరం వరంగల్ కు వెళ్తున్నారు. దారిలో నెల్లికుదురు మండలం మేచరాజుపల్లె దాటి ఎర్రబెల్లి గూడెం మీదుగా వెళ్తున్న సమయంలో, దారిలో కొంతమంది గాలంతో చేపలు పడుతూ కనిపించారు. వెంటనే మంత్రి కాన్వాయ్ ఆగింది. వాహనం దిగిన మంత్రి ఎర్రబెల్లి చేపలు పడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారిలో ఒకరి నుంచి గాలం తీసుకుని చేపలు పట్టారు. ఆ కర్రను పట్టి చేప కోసం మంత్రి వేట మొదలుపెట్టారు. గాలం వేస్తూ వాళ్లతో చిట్ చాట్ చేశారు. 


చెరువుల్లో సమృద్ధిగా నీరు 


ఒకప్పుడు తెలంగాణలో నిత్య కృత్యంగా కనిపించిన చేపల వేట ఉమ్మడి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక చెరువులలో నీరు సమృద్ధిగా చేరాయన్నారు.  ప్రభుత్వం చెరువుల్లో కోట్ల కొలది చేపలను ఉచితంగా వేస్తుందన్నారు. దీంతో స్థానికుల ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని చెప్పారు. చేపలు పట్టే వాళ్లకు ఉపాధి, ఆదాయం పెరిగాయన్నారు. ఇది సీఎం కేసిఆర్ సాధించిన గొప్ప విజయమని తెలిపారు. సబ్బండ కులాలకు, ఆయా కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చారన్నారు. మంత్రే నేరుగా తమ వద్దకు వచ్చి కాసేపు సరదాగా చేపలు పట్టడంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేశారు. 






తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన


మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ పెద్దవంగర మండల తహసీల్దార్ ఆఫీసుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటుందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి కేసీఆర్ పెట్టిన జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు కావాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాకే, పెద్ద వంగరకు తగిన గుర్తింపు దక్కిందన్నారు.


Also Read : Munugode Bypoll : రాజగోపాల్ రెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి, సీఈవోకు టీఆర్ఎస్ ఫిర్యాదు


 Also Read : Harish Rao: యూపీ వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ - హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్