Antarvedi News : పౌర్ణమి రోజుల్లో సముద్రపు పోటు ఎక్కువగా ఉంటుంది. సముద్రపు పోటుతో అంతర్వేది పల్లెపాలెం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యల సమయంలో ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మత్య్సకారులు వాపోతున్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెం గ్రామంలో పౌర్ణమి కావడంతో సముద్ర పోటు తీవ్రంగా ఉంది. దీని వలన సాగర సంగమం దగ్గర నుంచి భారీగా నీరు మత్స్యకారుల ఇళ్లలోనికి చేరుతోంది. దీని వల్ల  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతిసారి  అమావాస్యకు, పౌర్ణమికి నీరు ఇలా రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని  మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నీరు ఎక్కువగా ఉండడంతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నామని, పిల్లలు వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు దీనిపై దృష్టి సారించి రక్షణ గోడ నిర్మించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


నెలలో రెండుసార్లు తప్పని ఇబ్బందులు


పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది గ్రామంలోని పల్లిపాలెంలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో మత్స్యకారుల పల్లిపాలెం ఉంది. ఇక్కడ దాదాపు 300 కుటుంబాలకు పైగా నివసిస్తుండగా నెలలో రెండుసార్లు సముద్రపు నీరు పోటెత్తి పొలాల్లోకి చొరపడుతుండడంతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే పలుసార్లు సముద్రపు నీరు ముందుకు చొచ్చుకు వస్తున్న సందర్భంలోనూ ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు. 


కోతకు గురవుతున్న సముద్రతీరం 


అంతర్వేది, సఖినేటిపల్లి, మలికిపురం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తీర ప్రాంతాల్లో సముద్రపు కోత ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి కెరటాలు తీరాన్ని కబలిస్తున్నాయి.  ఇప్పటివరకు పదేళ్ల కాలంలో సుమారు 1000 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి అంతర్వేది తీరంలో అయితే మరింత దారుణంగా కనిపిస్తోంది. దీంతో అంతర్వేది తీర ప్రాంతంలోని పలు గృహాలు, కట్టడాలు ఇప్పటికే నేలకొరిగాయి.  సముద్ర గర్భంలో ఇప్పటికే తీరంలో ఉన్న పలు గృహాలు కలిసిపోయాయి. తీర ప్రాంతంలోని ఈ పరిస్థితిపై నిపుణులు కమిటీ వేసి సముద్ర కోత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


రైతులకు తీవ్ర నష్టం 


రాజోలు నియోజకవర్గ పరిధిలోని అంతర్వేది, కేశవదాసుపాలెం, అంతర్వేదికర గ్రామాల్లోని తీర ప్రాంతంలో సముద్రం పోటు ఉద్ధృతంగా ఉండటంతో  కెరటాలు ఎగసిపడి తోటలను ఉప్పునీరు ముంచెత్తుతోంది.  స‌రుగుడు తోట‌ల్లో ఇసుక పేరుకుపోయి, అంత‌ర పంట‌లు వేయ‌డానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. మ‌రోప‌క్క ఆ ప్రాంత రైతులు పోటు నీరు రాకుండా ఇసుకతో అడ్డుకట్టలు వేసుకుంటున్నారు. స‌ముద్ర తీరంలోని ఉండే పెద్ద పెద్ద ఇసుక దిబ్బల‌ను తవ్వేస్తుండడంతోనే స‌ముద్రపు నీరు పొలాల్లోకి చేరుతోందని మత్స్యకారులు అంటున్నారు. చిన్నపంట‌ కాలువ‌ల్లోకి ఉప్పు నీరు చేర‌డంతో  పంటలు ఆశించిన స్థానంలో పండడంలేదని రైతులు అంటున్నారు.  ఆర్థికంగా న‌ష్టపోతున్నామని అంటున్నారు. 


Also Read : Chiranjeevi Praja Rajyam : ప్రజారాజ్యం అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మిన చిరంజీవి


Also Read : Chiranjeevi Emotional Speech At Godfather Success Meet : 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?