పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేయబోతుందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఏపీలో కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామా తెరపైకి తెచ్చారంటూ అధికార వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రాజీనామా అని నేతలు చెబుతున్నారు. అయితే తమ ప్రాంతం అభివృద్ధి కోసం అయితే రాజీనామాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుమతి ఎందుకు అని ప్రశ్నించారు. 
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలి....
రాజీనామాకు సిద్ధపడిన వారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ఎందుకంటే ఎలా పడితే అలా రాజీనామాలు చేస్తే అవి చెల్లవు అని రాజీనామా డ్రామాలపై కామెంట్ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి రావాలని సీఎం జగన్ కు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంటే మీ అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలంటూ అధికార వైసీపీకి సూచించారు. 
చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా రాజీనామా చేయండి
ఏపీలో టీడీపీ నాయకులు సైతం సవాల్ చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నాయకులు కూడా తమ పదవుకు రాజీనామా చేయాలన్నారు. ఉత్తరాంధ్ర రాజధాని కోసం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం అన్నారు, మరి రాయలసీమ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నోరు నోరు మెదపడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు రాయలసీమ ద్రోహులు అన్నారు. 


ఏపీకి నీళ్లు, నిధులు అడ్డుకున్న వ్యక్తి కేసీఆర్
ఏపీని కాంగ్రెస్ పార్టీ తగలపెట్టిందని, ఏపీకి రావాల్సిన నిధులు, నీళ్లు రాకుండా చేసిన వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అయినా సిగ్గులేకుండా ఆయన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అంబులెన్స్ ను తెలంగాణలోకి రానివ్వలేదు. కానీ జాతీయ పార్టీ ప్రకటిస్తే ఇక్కడ సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు పెట్టారంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడం లేదు, వైసీపీ పార్టీ, బిఆర్ఎస్ మధ్య ఏదో ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా....
రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారిని రాబట్టడానికి యాత్ర చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మొదటి సంతకం ఈడి ఆఫీస్ లో పెడతారని జోస్యం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని ప్రశ్నించారు. 
యూపీ సీఎంను ఆదర్శంగా తీసుకోండి..
మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన ఇంతియాజ్ ను ఆ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో నేరాలను తగ్గించాలని ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ నేత సూచించారు.
ఏపీ ఆలయాల్లో అభిషేకం, ఇతర సేవలు ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. శ్రీశైలం ఆలయంలో 5వేల అభిషేకం టికెట్ ను పేరు మార్చి లక్ష రూపాయలు చేశారు. ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఏపీ దేవాదాయ ఆదాయ శాఖగా పేరు మార్చుకోవాలంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో సేవల ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖకు ఎంత మాత్రం నిధులు ఇస్తున్నారో చెప్పాలన్నారు.