'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా రాజ్యం' కోసం చిరంజీవి ఎన్ని కష్టాలు పడినది పేర్కొన్న ఆయన... ఆ పార్టీ నడపడం కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం చెన్నైలో కృష్ణా గార్డెన్స్ అమ్మేశారని తెలిపారు. 'జనసేన' పుట్టుకకు కారణాలు చెప్పడంతో పాటు... ఇకనైనా చిరంజీవి కఠినంగా వ్యవహరించాలని సెలవిచ్చారు.
'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ (Godfather Success Meet) రాజకీయ వర్గాల్లో సెగలు రేపింది. సక్సెస్ మీట్ స్టేజి మీద ఇటీవల చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) పై దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ), సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు, గేయ రచయిత అనంత శ్రీరామ్ వంటివారు విమర్శలు గుప్పించారు. అదంతా ఒక ఎత్తు అయితే... నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు.
చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా ఎన్వీ ప్రసాద్‌కు పేరు ఉంది. ఇండస్ట్రీలో ఆయన్ను మెగా మనిషిగా చూసే వారు ఎక్కువ. 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యాన్ని నిర్వహించటానికి ఎంత కష్టపడ్డారో వివరించే ప్రయత్నం చేశారు ఎన్వీ ప్రసాద్. ప్రజారాజ్యం తరపున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఎలక్షన్ బాధ్యతలు చూసిన వ్యక్తిగా అప్పటి పార్టీ అంతర్గత విషయాలను బయట పెట్టారు
ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన అప్పులు తీర్చడానికి...
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని చిరంజీవి విలీనం చేసినప్పుడు చాలా అప్పులు మిగిలాయని అయితే వాటిని తీర్చటానికి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ పక్కన ఉన్న కృష్ణా గార్డెన్స్ (Krishna Gardens Chennai)ను చిరంజీవి అమ్మారని సంచలన విషయాలు బయట పెట్టారు ఎన్వీ ప్రసాద్. ఆ అప్పులన్నీ తీర్చిన తర్వాతే తిరిగి సినిమాల్లోకి వెళ్లారని ఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. అయినా చిరంజీవిని టార్గెట్ చేస్తూ అప్పులు మిగిల్చి వెళ్లిపోయారని ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తనపైన ఎన్ని విమర్శలు వచ్చినా పెద్ద మనసు చేసుకుని చిరంజీవి మౌనంగా ఉండటం అవతలి వ్యక్తులు చెలరేగిపోవటానికి ఓ కారణం అని ఆయన వివరించారు.
జనసేన పార్టీ ఆవిర్భావం వెనుక అసలు సంగతి అదే!
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం చేసిన అప్పులు తీర్చడం, ఆస్తులు అమ్మడం వంటి విషయాలతో ఎన్వీ ప్రసాద్ ఆగలేదు. చిరంజీవి పెద్దరికం ప్రదర్శిస్తూ విమర్శలను సహిస్తున్నా... ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రకం కాదన్నారు. అన్నయ్యను మాట్లాడిన వాళ్లకు బుద్ధి చెప్పాలనే జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. అన్నయ్య చిరంజీవి ఆశయాలను నెరవేర్చటంతో పాటు పొలిటికల్ గా చిరంజీవిని ఇబ్బంది పెట్టిన వాళ్ల పని పట్టడం జనసేన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం ఆగ్రహం, ఆవేదన నుంచి పుట్టిన పార్టీగా జనసేనను ఎన్వీ ప్రసాద్ అభివర్ణించారు.
అభిమానులకు సందేశమా?
చిరంజీవి సన్నిహితుడు ఎన్వీ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. మొన్నటికి మొన్న జనసేన కు తన మద్దతు భవిష్యత్తులో ఉండొచ్చని చిరంజీవి చెప్పటం, పవన్ కల్యాణ్ ను లాంటి నాయకుడు ప్రజలకు కావాలని అనటం..ఇప్పుడు చిరంజీవి ముందే ఎన్వీ ప్రసాద్ జనసేన పుట్టడానికి కారణాలు అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ కలగలిసి ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ములు కలిసి క్రియాశీలక పాత్ర పోషించనున్నారనే సందేశాన్ని అభిమానుల్లోకి తీసుకెళ్తున్నాయనే టాక్ నడుస్తోంది. లేదంటే అసందర్భంగా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో ప్రజారాజ్యం గురించి, జనసేన పార్టీ గురించి చిరంజీవి ముందే ఓ ప్రొడ్యూసర్ ఎందుకిలా మాట్లాడతారని అంతా చర్చించుకుంటున్నారు.
Also Read : Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్