కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. 


మళ్లీ ఈ నెల 26 నుంచి మక్తల్‌లో తిరిగి రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.  అయితే, రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించాక, యాత్ర కొనసాగాల్సిన రూట్‌ మ్యాప్‌పై కూడా సమీక్ష జరిగింది. టీపీసీసీ కీలక నేతలు శనివారం గాంధీ భవన్‌లో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పర్యవేక్షకులు బైజు, సుశాంత్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.


ఆలయాల సందర్శన


తెలంగాణలో ప్రముఖ దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నట్లు తెలుతస్తోంది. త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెద‌క్ చ‌ర్చికి వెళ్తారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది.


ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కొనసాగుతుంది. మొన్న భారత్‌ జోడో యాత్ర ఓ వైపు వర్షం పడుతున్నా కొనసాగింది. రాహుల్‌ పాదయాత్రకు కర్నాటక కాంగ్రెస్‌ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2017లో హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేష్ కుటుంబ సభ్యులు కూడా రాహుల్ వెంట నడిచారు. ఆయన చేయి పట్టుకుని లంకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తున్న ఫోటోను రాహుల్ గాంధీ ట్విటర్‌లో షేర్ చేశారు. సెప్టెంబర్ 8న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వందల కిలోమీటర్లు పూర్తయింది. వచ్చే 23వ తేదీన తెలంగాణలోకి ఈ యాత్ర ప్రవేశించనుంది.


జర్నలిస్ట్, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ పై 2017 సెప్టెంబరు 5న దక్షిణ బెంగళూరులోని ఆమె నివాసం ముందు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గౌరీ మరణం తరువాత, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.