Hawala Money: హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ వద్ద 79 లక్షల 25వేల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చంద్రాయణ గుట్ట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానంగా కనిపించిన రెండు కార్లను ఆపి సోదాలు చేశారు. అందులో 79.25 లక్షల డబ్బు కనిపించింది. అయితే డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు నడుపుతున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్, హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


మూడు పబ్ లపై కేసు నమోదు..


మాదాపూర్ జోన్ లోని 22 పబ్ లపై సైబరాబాద్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాజాగా పబ్ లపై హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ తనిఖీలు చేసినట్లు వివరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధిక శబ్దం ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన మూడు పబ్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్ ల యజమానులు, మేనేజర్ లు, డీజే ఆపరేటర్లు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డీజేకి ఉపయోగించే సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు. 


పబ్ ల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు..


హైదరాబాద్ లో పబ్ నిర్వహణపై హైకోర్టు ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్స్ నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి  10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్  ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది. 


పబ్ లో డ్రగ్స్ పార్టీలపై..


హైదరాబాద్ లోని పలు పబ్ లో డ్రగ్స్ పార్టీలు జరిగిన ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యి నిబంధనలు కఠినతరం చేసింది. ముఖ్యంగా పబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ పలు ఆదేశాలు ఇచ్చింది. గీత దాటితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. పబ్ ను పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. అలా కెమెరాలు ఏర్పాటు చేయని పబ్ ను మూసివేయాలని పోలీసులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. అదే విధంగా పబ్ కెమెరాలను పోలీసులకు అనుసంధానం చెయ్యాలని సూచించింది. పబ్ లో మంచి బ్రాండ్ లు, మంచి ఫుడ్ అందుబాటులో ఉంచాలని, లైట్ మ్యూజిక్ ఉంటే చాలు అని సూచించింది. అశ్లీలం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుటామని పబ్ నిర్వాహకులను హెచ్చరించింది.