Munugode Bypoll : మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది. ఆదివారం సీఈవో నివాసంలో కలిసిన టీఆర్ఎస్ బృందం రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టీవీ ఛానల్ లో స్వయంగా చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అన్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ను రాజగోపాల్ రెడ్డి పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఇచ్చిపుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేశారని ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో పోటీ చేయకుండా ఆన్ క్వాలిఫై చేయాలని ఎన్నికల అధికారిని కోరామన్నారు. కాంట్రాక్ట్ లో వచ్చిన డబ్బులతో మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఈటల, వివేక్ లకు వాటా
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని స్వయంగా ఒప్పుకున్నారని టీఆరెఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ టీఆర్ఎస్ తరఫున ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ కాంట్రాక్టులో ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ కు కూడా వాటా ఇస్తామని చెప్పారన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని మోదీ అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి వాడికి ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదని, పైసల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బీజేపీ వాళ్లు కృత్తిమ ఎన్నిక తెచ్చారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్టి , బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారన్నారు. మునుగోడులో గులాబీ జెండా ఎగురుతోందన్నారు.
Also Read : Revanth Reddy : మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారు- రేవంత్ రెడ్డి
Also Read : Harish Rao: యూపీ వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ - హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్