ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మంత్ర తంత్రాలతో తాము ఏమైనా అధికారంలోకి వచ్చామా అంటూ ప్రశ్నించారు. మతం పేరుతో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయం చేసేది ఒక్క బీజేపీనే అని అన్నారు. అందుకే భూతవైద్యం కోర్సు నేర్చుకోవాలని ఉత్తర్ ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కొత్త కోర్సును తీసుకొచ్చిందని అన్నారు. మంత్ర తంత్రాలు, మత కల్లోలాలు బీజేపీకి తెలిసినంత ఎవ్వరికీ తెలియవని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ యూపీకి వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే మంచిదని ఎగతాళి చేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.






బీజేపీకి దమ్ముంటే మునుగొడులో అభివృద్ధి గురించి మాట్లాడాలని, తాము చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్ దగ్గర తాంత్రిక విద్యలు లేవని, లోక్‌తాంత్రిక్ మాత్రమే ఉందని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని హరీష్‌ రావు ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఏం చెప్తారని నిలదీశారు. మునుగోడు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు 200 కార్లు, 2 వేల మోటర్‌ సైకిళ్లు బుక్‌ చేశారని చెప్పారు.


మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ వల్లే..
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిపెట్టిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి దొడ్డి దారిన గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాకుండా కార్లు మోటర్ సైకిళ్ళు గిఫ్ట్‌గా ఇస్తున్నారని కూడా అన్నారు. ఇప్పటికే మునుగోడులో పంచేందుకు 200 బ్రెజ్జా కార్లు, 2 వేల మోటర్ సైకిళ్ళు బుక్ చేసినట్లు తెలిసిందని అన్నారు. మండలాలవారీగా ఓటర్లకు పంచుతున్న కార్లు, బైకుల లిస్టును ఎన్నికల కమిషన్‌కు ఇస్తామని చెప్పారు.


ఇది మునుగోడుకు ఆత్మగౌరవ పరీక్ష అని హరీష్‌రావు అన్నారు. మునుగోడు ప్రజలు గెలవాలా? రాజగోపాల్ రెడ్డి ధనం అహంకారం గెలవాలా? అనేది ముఖ్యం అని అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం రూ.లక్ష ఇస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని చెప్పారు. రైతుబంధు, రైతు బీమాతో పాటు మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. ఇటీవల కేంద్రం నుంచి అందుకున్న అవార్డులే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.


ధరలు పెంచుకుంటారని చెప్పుకుంటారా?
వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచామని ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు చెప్పుకుంటారా? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్ముతున్నది కేంద్ర ప్రభుత్వం అని ఆక్షేపించారు. దేశ సైనికులను కూడా విడిచిపెట్టకుండా వారి ఉసురు తీసిన బీజేపీ ప్రభుత్వం.. చేనేత కార్మికులకు ఇచ్చిన పథకాలను తొలగించి వేసిందని ఆరోపించారు. దేశంలో ఒక్క వర్గం వారికైనా బీజేపీ మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు.


మునుగోడు ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని బీజేపీ నేతలు.. క్షుద్రపూజలు అని ఒకరు, అవినీతి అని మరొకరు అంటున్నారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ దివాళాకోరు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.