Revanth Reddy : హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏఐసీసీ సెక్రటరీలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...మునుగోడు ఉపఎన్నిక ప్రచారంపై ముఖ్య నేతలతో చర్చించామని తెలిపారు. నేటి నుంచి 14 తేదీ వరకు ముఖ్య నేతలంతా మునుగోడు ప్రచారంలోనే పాల్గొంటారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఏఐసీసీ నేతలు మాట్లాడుతున్నారని, ఆయన ప్రచారానికి వస్తారని వెల్లడించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 23న ఉదయం 7 గంటలకు తెలంగాణలో ఎంటర్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 31న ఇంధిరా గాంధీ వర్థంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ పై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. అనంతరం చౌటుప్పల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఆడబిడ్డకు అవకాశం ఇవ్వండి
"బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మిత్ర భేదమే తప్ప శత్రు భేదం లేదు. వాటాల పంపకం విషయంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పంచాయితీ నడుస్తోంది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం లాంటివి టీఆర్ఎస్, బీజేపీలు. గులాబీ వసూళ్లపై సెంట్రల్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడుపోయారు. వారి వెంట మీరు ఉండరని అనుకుంటున్నా. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పోయిండు రాజగోపాల్. అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఆయనకే తెలియాలి. ఓట్ల రూపంలో వారిని చిత్తు చిత్తు చేయాలి. చీర నేసే పని కూడా సిరిసిల్లకే పోతోంది. ఈ విషయం ఇక్కడి పద్మశాలీ సోదరులు ఆలోచించాలి. ఎవడైనా పార్టీ మారాలని బెదిరిస్తే ఎంతటివారైనా వాళ్ల వీపు విమానం మోత మోగుతుంది. పేదోళ్ల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ కు అండగా నిలబడి కాంగ్రెస్ ను గెలిపించండి. నాలుగు ఉప ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీని గెలిపిస్తే మార్పు రాలే. మహిళలంటే కేసీఆర్ కు చిన్న చూపు. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వండి. మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ సమస్యలపై కొట్లాడి మీ వైపు నిలబడుతుంది. ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టండి. "- రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లో కోవర్టులు లేరు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడుపైనే ప్రధానంగా చర్చ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు. నవంబర్ 6న అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారని తెలిపారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీలపై చేసిన వాఖ్యలు నిరాధారణమైనవన్నారు. తాను భారత్ జోడో కో ఆర్డినేటర్ గా ఉన్నానన్నారు. కాంగ్రెస్ లో కోవర్టులు ఎవరు లేరని పేర్కొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.
వెంకటరెడ్డిపై అనుమానాలొద్దు- భట్టి విక్రమార్క
మునుగోడులో ఎలాంటి వ్యూహం అవలంభించాలనే దానిపై చర్చించాం. ముఖ్య నేతలంతా మునుగోడుపై దృష్టి సారించాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎలాంటి అనుమానాలు వద్దు. ఆయన పార్టీ విజయం కోసం పనిచేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సస్పెండ్ చేయాలని ఎవరు డిమాండ్ చేసారో నాకు తెలియదు."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారంచేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ ఈ విషయంపై వెంకటరెడ్డి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా పార్టీలో యాక్టివ్ ఉండడంలేదు. మునుగోడు నియోజకవర్గనేతలు వెంకటరెడ్డి కోవర్టుగా పనిచేస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Police Jobs: పోలీస్ జాబ్ కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వండి - సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
Also Read : Harish Rao: యూపీ వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ - హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్