TS Minister Srinivas Goud: మైసమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన మంత్రి చేయి పట్టుకుని ఓ బాలుడు వేడుకున్నాడు. తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరగా.. బాలుడి ఆవేదన, పరిస్థితి చూసిన మంత్రి చలించిపోయారు. వెంటనే స్పందించిన మనసున్న మంత్రి బాలుడ్ని అక్కున చేర్చుకున్నారు. తన వాహనంలో తీసుకెళ్లి బాలుడ్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
మైసమ్మ దర్శనానికి మంత్రి..
ఈ బాలుడి పేరు విజయ్ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు. ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైసమ్మను దర్శించుకుని పూజలు చేసేందుకు వచ్చారు. కూల్ డ్రింక్ విక్రయిస్తున్న బాలుడు విజయ కుమార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని చూసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి చేయిపట్టుకుని నన్ను చదివించండి సర్ అంటూ ఏడుపు అందుకున్నాడు. పిల్లవాడి పరిస్థితి, చదువుకోవాలన్న కోరిక మంత్రిని కదిలించింది. చదువుకోవాలనే బాలుడి శ్రద్ధ, అందుకు పడుతున్న ఆవేదనను గమనించి వెంటనే బాలుడిని తన వాహనంలో ఎక్కించుకున్నారు. తన పక్కనే కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే పట్టణంలో మంచి పేరున్న రిషి విద్యాలయం వాళ్లకు ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతి లో చేర్చుకుని హాస్టల్ వసతితి పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని తెలిపారు.
దుస్తులు, వస్తువులు సైతం..
బాలుడు విజయ్ కుమార్‌కు అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులన్నీ కొనాలని తన వ్యక్తిగత సిబ్బందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆ విద్యార్థి జీవితంలో స్థిరపడేలా చేస్తామని అంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి తెలిపారు. తన సొంత బిడ్డలా చూసుకుని, అతడికి విద్యాబుద్ధులు అందిస్తామని తెలిపారు. బాలుడికి దుస్తులు, పుస్తకాలు, బూట్లు, ఇతర వస్తువులన్నీ ఇప్పించారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల బాలుడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించి వేసిందని మంత్రి తెలిపారు. బాలుడు జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పేదల పట్ల ఉన్న అభిమానానికి బాలుడి బాధ్యత చిన్న ఉదాహరణ మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు.