Vikarabad Family Missing Case: భార్య ఆచూకీ కోసం పోలీసులకు 48 గంటలు గడువు ఇచ్చిన భర్తతో పాటు కుమార్తెలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుంచి సత్యమూర్తి భార్య అన్నపూర్ణ అదృశ్యమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఇన్నిరోజులు గడుస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో విసుగుచెందిన సత్యమూర్తి పోలీసులకు రెండు రోజుల గడువు ఇచ్చారు. కూతుర్లతోపాటు ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సత్యమూర్తి నిజంగానే ఫ్యామిలీతో సహా అదృశ్యమయ్యారు. వీరిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. పిల్లలతో కలిసి ముంబైకి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 


తాండూరులో నివాసం.. కానీ భార్య మిస్సింగ్.. 
వికారాబాద్ జిల్లా బీఎస్​పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి తాండూరు శివాజీ చౌర‌స్తా ప్రాంతంలో భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. మూడు నెలల కిందట భార్య అన్నపూర్ణ మిస్సింగ్ పై భర్త సత్యమూర్తి తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ స‌భ్యులు అన్నపూర్ణ తెలిస్తే త‌మ‌ను సంప్రదించాల‌ని, ఆమె గురించి తెలిపిన వారికి రూ.5 ల‌క్షల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తాండూరులో చ‌ర్చనీయాంశ‌ం అయింది. 
మూడు నెలల నుంచి తన భార్య కనిపించడంలేదని, ఈ విషయంపై పోలీసుల ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందిన సత్యమూర్తి.. 48 గంటల్లో ఆమె ఆచూకీ కనిపెట్టకపోతే కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భార్య అదృశ్యంపై  పెద్దల హస్తం ఉందని సత్యమూర్తి ఆరోపించారు. 


కుమార్తెలతో కలిసి సత్యమూర్తి అదృశ్యం కావడంపై తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. గత మూడు నెలల క్రితం తన భార్య అన్నపూర్ణ అదృశ్యమైందని సత్యమూర్తి ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా ప్రయోజనం కనిపించలేదు. ఈ మేరకు భార్య అదృశ్యం కేసును చేదించడం లేదని సత్యమూర్తి 48 గంటల గడువును ప్రకటించి, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో పోస్ట్ చేయగా, వైరల్ అయింది. వీడియో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే సత్యమూర్తి కుమార్తెలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సత్యమూర్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షం..
సత్యమూర్తి తన కారులో పిల్లలతో కలిసి పరిగి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ లో సత్యమూర్తి పార్కింగ్ చేసిన కారును పోలీసులు గుర్తించారు. సత్య మూర్తికి సంబంధించిన సీసీ ఫుటేజ్  సేకరించి మీడియాకు అందించారు. ఎయిర్ పోర్ట్ నుంచి తన పిల్లలతో కలిసి సత్యమూర్తి ముంబైకి వెళ్లినట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు సత్యమూర్తి ముంబైలో ఉన్నారా, లేక మరోచోటుకు వెళ్లారా తేలియాల్సి ఉంది. సత్యమూర్తి ఫ్యామిలీని తిరిగి తీసుకొచ్చేందుకు పోలీసు బృందాలు  ముంబైకి బయల్దేరాయి. 


Also Read: Vikarabad Selfie Video : 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టాలి లేకపోతే చనిపోతాం, వికారాబాద్ లో సెల్ఫీ వీడియో కలకలం!