BJP focusing on Hyderabad: తెలంగాణలో అధికారం సాధించేందుకు ముందుకు సాగుతున్న జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పట్టణాలు, నగరాలే కేంద్రంగా బీజేపీ తన వ్యూహాలు మార్చుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) సత్తా చాటిన బీజేపీ భాగ్యనగరంలో ఎక్కువ సీట్లు సాధించి ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం, హైదరాబాద్ లోని ప్రతి నియోజకవర్గానికి కేంద్ర మంత్రులు, ఎంపీలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడం చూస్తే కమలనాథుల వ్యూహంపై కొంచెం క్లారిటీ వస్తుంది. 


ఉప ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. 
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కుచుకునేందుకు ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ (TRS Party)కు ప్రత్యామ్నయం మేమే అన్నట్లుగా ముందుకు సాగుతున్న బీజేపీ మరోవైపు పార్టీకి కొంత ఆదరణ ఉన్న పట్టణాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో 48 కార్పోరేటర్‌ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తన దృష్టి పూర్తిగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించారు బీజేపీ నేతలు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకునే వ్యూహంలో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు జాతీయ నాయకత్వం అంతా హైదరాబాద్‌లోనే మకాం వేయనున్న నేపథ్యంలో ఇదే అదనుగా బాగ్యనగరంలో ఉన్న నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
నగరంలోని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు..
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కలిపి మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పాతబస్తీలో ఉన్న ఏడు నియోజకవరాల్లో అంతగా ప్రయోజనం లేని నేపథ్యంలో ఆ ప్రాంతం కేంద్రంగా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ మిగిలిన ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, ఎంపీలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కిరణ్‌ రిజీజు, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌ ఠాకూర్‌లతోపాటు సీనియర్‌ నాయకులు రమణసింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, ప్రకాష్‌ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, రాజీవ్‌ ప్రసాద్‌ రూడీ, సినీ నటి ఖుష్బూ లాంటి సీనియర్‌ నేతలను నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడం చూస్తే భాగ్యనగరంపై బీజేపీ పట్టు సాదించేందుకు ఎన్ని ప్రణాళికలు రచిస్తుందో అర్థమవుతుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా జరిగే సభకు భారీ జనసమీకరణ చేయడంతోపాటు రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని అమలు చేయడం, ప్రజాదరణ పొందడం వంటి అంశాలపై బీజేపీ ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ రానున్న రోజుల్లో తొలుత హైదరాబాద్‌లోనే పాగా వేయాలని భావిస్తోంది.


Also Read: Presidential Election 2022: నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్


Also Read: Khammam: ఏజెన్సీలో మళ్లీ పోడు పోరు, పట్టాలెప్పుడు వచ్చేనో? మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినా పరిష్కారం కాని సమస్య