అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు పోడు కొట్టుకుని సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల సమస్య పరిష్కారం కావడం లేదు. వ్యవసాయ సీజన్ రావడంతో భూములకు ట్రెంచ్ కొట్టేందుకు అటవీశాఖ అధికారులు సిద్దమవుతుండగా మరోవైపు పోడు భూములను కాపాడుకునేందుకు గిరిజనులు పోరాటం చేస్తున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలిచ్చేందుకు 2005లో అటవీ హక్కుల చట్టం పేరుతో పట్టాలను పంపిణీ చేశారు. ఈ చట్టం ప్రకారం 2005కు ముందు సాగులో ఉన్న అటవీ భూములకు 10 ఎకరాలకు మించకుండా లబ్ధిదారులకు అందజేశారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అటవీ హక్కుల చట్టం ద్వారా 99,486 మంది లబ్ధిదారులకు 3,31,07 ఎకరాలకు పట్టాలు అందించారు. ఈ ప్రస్థానం 2010 వరకు సాగింది. అనంతరం పోడు భూములకు సంబంధించిన పట్టాల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే పట్టాలు రాని భూములను అటవీశాఖ అధికారులు తమ భూబాగంలో కలుపుకునేందుకు భూముల్లో ప్లాంటేషన్ వేయడంతోపాటు ట్రెంచ్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగడంతో అప్పట్నుంచి పోడు సాగు చేసుకుంటున్న రైతులకు అటవీశాఖ అధికారులకు మద్య గొడవలు సాగుతూనే ఉన్నాయి. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో పోడు భూములకు పట్టాలివ్వాలనే అనేక ఉద్యమాలు జరిగాయి.
మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఈ కమిటీ మూడు, నాలుగు దఫాలుగా సమావేశం అయింది. ఈ కమిటీ విధివిధానాలు రూపొందించి ధరఖాస్తులు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82,737 ధరఖాస్తులు, ఖమ్మం జిల్లాలో 18,603 దరఖాస్తులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 7,515 ధరఖాస్తులు, వరంగల్ జిల్లాలో 7,389 ధరఖాస్తులు, ములుగు జిల్లాలో 28,860 ధరఖాస్తులు, ఆదిలాబాద్ జిల్లాలో 18,884 ధరఖాస్తులు, మంచిర్యాల జిల్లాలో 11,774 ధరఖాస్తులు, నిర్మల్ జిల్లాలో 8,666 ధరఖాస్తులు, ఆసీఫాబాద్ జిల్లాలో 26,680 ధరఖాస్తులు, మహబూబాబాద్ జిల్లాలో 32,697 ధరఖాస్తులు వచ్చాయి.
అయితే, ఇప్పటి వరకు పట్టాల పంపిణీ ప్రక్రియ జరగకపోవడంతో మళ్లీ అటవీ అధికారులు, పోడు సాగుదారుల మధ్య పోరు సాగుతూనే ఉంది. జూన్ నెలలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి అంతకు ముందే పోడు భూములకు పట్టాలివ్వాలని పోడు సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. పట్టాల పంపిణీ లేకపోవడంతో గిరిజనులు పోడు భూములను స్వాదీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలో పోడు భూములను స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో వాటిని గిరిజనులు అడ్డుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల పోడు భూముల స్వాదీనం చేసుకునే క్రమంలో గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు విచక్షణరహితంగా కొట్టడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అయితే పోడు భూములకు సంబంధించిన సమస్యకు పరిష్కారం ఎప్పుడు అవుతుందనే విషయంపై గిరిజనులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.