Presidential Election 2022 : విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నేడు(జూన్ 27) నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ దిల్లీకి బయలుదేరివెళ్లారు. కేటీఆర్‌తో పాటు లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్‌ రెడ్డి, వెంకటేశ్‌నేత, బీబీ పాటిల్‌, ప్రభాకర్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. వీరంతా సోమవారం దిల్లీలో జరిగే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో టీఆర్ఎస్ తరఫున పాల్గొంటారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. 


టీఆర్ఎస్ మద్దతు 


 రాష్ట్రపతి ఎన్నికల్లో  విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. ఇటీవల విపక్ష పార్టీ నేతలందరూ సమావేశమై యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటేయాల్సిందిగా కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పలువురు పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. వారందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం కాబట్టి ఆ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వైసీపీ మద్దతు ఎన్డీయే అభ్యర్థికే 


ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ వెంట నడిచేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. వైసీపీ తరఫున ఎంపీలు విజయసాయి రెడ్డి, పీవీ మిథున్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం దక్కడం శుభపరిణామమని వైసీపీ పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయానికి ఏపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపింది. ఈ క్రమంలోనే ద్రౌపది ముర్ముకే తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర కేబినెట్ భేటీ కారణంగా శుక్రవారం జరిగే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరు కాలేకపోయారని తెలిపింది. అయితే పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.