బెయిల్ పై బయటికి వచ్చిన ఓ నిందితుడిని కొందరు కిడ్నాప్ చేసి అతనికి పెళ్లి చేసిన వైనం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అతను కొద్ది రోజుల క్రితమే ఓ కేసులో అరెస్టయి జైలులో ఉండి కండీషనల్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాలనే నిబంధన ఉంది. ఆ క్రమంలోనే నిందితుడు సంతకం పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వస్తుండగా, కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా గుడిలో పెళ్లి చేశారు. ఈ ఘటన ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చైతన్యపురి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్‌నకు చెందిన ననావత్ వెంకటేష్ నాయక్ అనే 26 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్ల క్రితం ఓ యువతిని వేధించాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో అతను జైలుకు కూడా వెళ్లాడు. తర్వాత బెయిల్ కి అప్లై చేయడంతో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అది కండిషన్ బెయిల్ కావడంతో రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి రావాల్సి ఉంది. అలా ఆదివారం ఉదయం సంతకం చేసేందుకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ కారులో వచ్చిన తన స్నేహితుడు విజయ్‌ను వెయిట్ చేయమని చెప్పి స్టేషన్‌లోకి వెళ్లాడు.
లోపల సంతకం పెట్టి వీరు తిరిగి వెళుతుండగా చైతన్యపురి జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కారును ఆపారు. వెంకటేష్‌ను కారు దిగమని చెప్పి అతణ్ని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లారు. తన స్నేహితుడు వెంకటేశ్‌ను ఎవరో బైక్ పైన బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ కారులోని వ్యక్తి విజయ్ మరో వ్యక్తికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇటు వెంకటేష్‌ను సింగరేణి కాలనీకి తీసుకెళ్లి అక్కడ ఓ గుడిలో వివాహం జరిపించారు. గతంలో తనపై కేసు పెట్టిన యువతి దివ్యతో బలవంతంగా పెళ్లి జరిపించారు.
అక్కడకు వెళ్లిన స్నేహితుడు విజయ్ కుమార్ ఈ విషయంపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అనంతరం వెంకటేశ్ ను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరిపారు. తనపై కేసు పెట్టిన యువతి కుటుంబానికి చెందిన వారు తనను బలవవంతంగా తీసుకెళ్లి ఆమెతో పెళ్లి చేయించారని పోలీసులకు చెప్పాడు. గజానాయక్, నిరంజన్ నాయక్, ఆర్.గోపాల్ మరికొందరిపై వెంకటేశ్ నాయక్ ఫిర్యాదు చేశాడు.
Also Read: వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం - భార్య ఆచూకీ దొరకడం లేదని భర్త, కుమార్తెలు అజ్ఞాతంలోకి