టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. తనతో పాటు తన కుమారుడిని కూడా చంపుతానని ఎమ్మెల్యే బెదిరించినట్లుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సొంత పార్టీ అయిన తననే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అసభ్యంగా కూడా దూషించినట్లుగా పేర్కొన్నారు. ఇలా సొంత పార్టీ మహిళా నేత తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అమెరికాలో ఉండే తన కొడుకు.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారని, ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే తననూ, తన కొడుకునూ చంపుతానని ఫోన్లో బెదిరిస్తున్నాడని పద్మా రెడ్డి అనే స్థానిక టీఆర్ఎస్ మహిళా నేత ఆరోపించారు. గతంలో కూడా మూడు సార్లు ఇదే విధంగా ఎమ్మెల్యేతో పాటు అనుచరులు బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు, తన కుమారుడికి ప్రాణ హాని ఉందని వాపోయారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
అయితే, ఎమ్మెల్యేపై ఇప్పటికే పలు భూ వివాదాలు ఉన్నాయి. అంతేకాకుండా కౌన్సిలర్ కుమార్తెను కూడా బెదిరించినట్లు గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, స్థానిక విపక్ష నేతలు మాత్రం మహిళకు మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపైనే ఇలా దురుసుగా ప్రవర్తిస్తే, ఇతరులను ప్రజలను ఎలా చూస్తారని వారు నిలదీస్తున్నారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు.. చివరి ట్రైన్ టైం ఇంకా పొడిగింపు