రక్తహీనతను దరి చేరకుండా చేయడంలో బీట్ రూట్ తరువాతే ఏదైనా. కానీ ఆ కూరను ఇష్టపడే వాళ్లు తక్కువే. పిల్లలు కూడా తినేందుకు అమ్మల్ని చాలా కష్టపెడతారు. అలాంటివారి చేత బీట్ రూట్ తినిపించాలంటే ఈ టేస్టీ బీట్ రూట్ హల్వా చేసి పెట్టండి. గాజర్ హల్వాలాగే బీట్ రూట్ హల్వా కూడా ఘుమఘుమలాడుతూ  నోరూరించేస్తుంది. పండుగలప్పుడు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. 


కావాల్సిన పదార్థాలు:


బీట్ రూట్ - రెండు (మీడియం సైజువి)
పాలు - ఒక కప్పు
పంచదార - అరకప్పు
యాలకుల పొడి - అర టీస్పూను
నెయ్యి - రెండు టీ స్పూనులు
జీడి పప్పులు - ఆరు 
కిస్మిస్లు - పది 


Also read: బిగ్‌బాస్ తెలుగు 5 ప్రోమో.. హౌస్‌లోకి నాగ్ ఎంట్రీ, ఇక టన్నుల కొద్ది కిక్!


తయారీ విధానం:


1. బీట్ రూట్లపైనున్న తొక్కని చెక్కేయాలి. మిగతాదంతా సన్నగా గ్రేటర్ తో తరిగేయాలి. ఆ తరుగును పక్కన పెట్టుకోవాలి. 


2. కళాయిపై కాస్త నెయ్యి వేసి వేడి చేయాలి. జీడిపప్పులు, కిస్మిస్ లు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. 


3. కళాయిలో మరికాస్త నెయ్యి జోడించి బీట్ రూట్ తరుగును వేసి వేయించాలి. మీడియం మంట మీద పదినిమిషాలు వేయిస్తే పచ్చిదనం తాలూకు వాసన పోతుంది. 


4. ఇప్పుడు అందులో కప్పు పాలు పోసి సన్నని మంట మీద వేయించాలి. అడుగంటకుండా రెండు నిమిషాల కోసారి కలుపుతూ ఉండాలి. 


5. పాలు, బీట్ రూట్ తరుగు బాగా కలిసిపోయి దగ్గరగా చేరాక అందులో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగి ఆ మిశ్రమంలో బాగా కలిసే వరకు ప్రతి మూడు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి. దాదాపు ఇలా పావుగంట సేపు ఉడకనిస్తే చాలు బీట్ రూట్ హల్వా సిద్ధమైనట్టే. 


6. బీట్ రూట్ హల్వాని ఒక బౌల్ లోకి తీసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. పిల్లలకు కచ్చితంగా నచ్చే స్వీట్ ఇది. 


బీట్‌రూట్‌లో పోషకాలెన్నో..:


ఆరోగ్యకరమైన కూరగాయల్లో బీట్ రూట్ కూడా ఒకటి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. శరీరంలో చెడుకొవ్వును చేరనివ్వదు. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి కనుక రక్త హీనతను దరి చేరనివ్వదు. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. 


Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ అపోహలు నమ్మకండి