హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాత్రి వేళ రైలు సమయాల్లో మార్పులు చేసింది. చివరి మెట్రో సర్వీస్ సమయాన్ని అరగంట పాటు పొడిగించింది. దీంతో ఇకపై రాత్రి 10.15 గంటలకు చివరి మెట్రో రైలు సర్వీస్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం రాత్రి 9.45 గంటలకే నగరవాసులకు చివరి మెట్రో సర్వీస్‌ను అందుబాటులో ఉంది. అయితే, ఉదయం రైలు సర్వీసులు ప్రారంభంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు మెట్రో తొలి సర్వీస్ మొదలు కానుండగా.. ఇకపై కూడా అలాగే కొనసాగనున్నాయి.
లాక్ డౌన్ 2.0 తర్వాత ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు కూడా రైలు సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సడలింపులకు అనుగుణంగా రైలు సమయాల్లోనూ మార్పులు చేస్తూ వచ్చారు. చివరికి ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని రాత్రి 9.45 గంటలకు చివరి ట్రైన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా ఆఖరి ట్రైన్ మొదలయ్యే సమయాన్ని 10.15 గంటలకు మార్చారు.
నష్టాల్లోనే మెట్రో..
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం హైదరాబాద్ మెట్రోపైన కూడా విపరీతంగా పడిన సంగతి తెలిసిందే. మొత్తం కలిపి నష్టాలు ప్రస్తుతం రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోలో ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థకి 90 శాతం వాటా ఉండగా, తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం మాత్రమే వాటా ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా, చివరికి రూ.18,971 కోట్ల ఖర్చు అయింది.
నష్టాలు వచ్చాయి ఇలా..
ఇందులో సుమారు రూ.13,500 కోట్లను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎల్ అండ్ టీ సంస్థ వివిధ మార్గాల ద్వారా రుణాలు సేకరించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మొదలయ్యాక అంటే 2019-20 ఏడాదిలో వివిధ కారణాల వల్ల 383.20 కోట్లు నష్టాలు వచ్చాయి. ఇక 2020-21లో ఈ నష్టాలు మొత్తం కలిపి ఏకంగా రూ.1,766 కోట్లకు చేరాయి. కొవిడ్ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 6 నెలల పాటు మెట్రో రైల్ సేవలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్ లాక్ అయి మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అయి కాస్త ఊరట కలిగే లోపే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది.
లాక్ డౌన్ 2.0 తో అనేక ఆంక్షల నడుమ రైళ్లను నడిపించాల్సి రావడంతో ఆర్థిక భారం మరింత పెరిగిపోయింది. కరోనా భయంతో ప్రయాణికులు విపరీతంగా తగ్గిపోయారు. ఈ వ్యవధిలోనూ నష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. మొత్తం కలిపి రూ.2 వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ నష్టాల నుంచి ఆదుకోవాలని గతంలో ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వాన్ని సైతం కోరింది.
వాటా విక్రయించే ఛాన్స్
అయితే, ఈ నష్టాల నుంచి బయట పడేందుకు ఎల్ అండ్ టీ సంస్థ తన వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, తమ పూర్తి వాటాను అమ్ముతారా లేక కొంత షేర్ అమ్ముతారా? అనే అంశంపై స్పష్టతలేదు. హైదరాబాద్ మెట్రో వాటాతో పాటు పంజాబ్‌లోని నభా థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎల్ అండ్ టీ ఆస్తుల్ని కూడా విక్రయిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి గతంలో తెలిపారు.