ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. మరో పక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీకి వర్ష సూచన
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం వైపు కదిలే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వివరించింది. వీటి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించింది. రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణ శాక అంచనా వేస్తుంది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇతర జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.
Also Read: Komatireddy Congress : ఉంటే ఉండు...పోతే పో ! కోమటిరెడ్డికి మధుయాష్కీ ఫైనల్ వార్నింగ్ !
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 4.5 కి మీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొద్ది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో ఉత్తర, పరిసర మధ్య బంగళాఖాతంలో రాగల 48 గంటలలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.
వీటి ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో
హైదరాబాద్‌లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరవాసులు అల్లాడిపోయారు. నగరంలో మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. నిన్నటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read: నాకు 85 సంవత్సరాలు.. దయచేసి పింఛను ఇప్పించండి బాబు