ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 270/3 స్కోర్‌తో నిలిచి 171 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(22; 37 బంతుల్లో 4x4), రవీంద్ర జడేజా (9; 33 బంతుల్లో 2x4) నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (127; 256 బంతుల్లో 14x4, 1x6) శతకంతో మెరవగా పుజారా (61; 127 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
వీరిద్దరి జోడీని రాబిన్‌సన్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపి భారత్‌కు ఝలక్ ఇచ్చాడు. 81వ ఓవర్‌లో తొలుత పుల్‌షాట్ ఆడిన రోహిత్.. క్రిస్ వోక్స్‌కి చిక్కాడు. చివరి బంతికి పుజారా... మొయిన్ అలీ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మూడో రోజు ఆటను ముగించారు. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగా నిలిపివేశారు.
ఇక నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడుతుంది. 55/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్, రాహుల్(46; 101 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరూ టీమ్ ఇండియా భారీ స్కోర్ సాధించడానికి ప్రయత్నింస్తుండగా... అండర్సన్ విడదీశాడు. 34వ ఓవర్ చివరి బంతికి రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. ఆపై క్రీజులోకి వచ్చిన పుజారా.. రోహిత్‌తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సిక్సర్ బాది టెస్టుల్లో ఎనిమిదో శతకం, విదేశీ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ రెండో సెషన్‌లో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. ఇక మూడో సెషన్‌లో పుజారా అర్ధశతకం సాధించాడు. దీంతో మరింత ప్రమాదకరంగా మారిన వీరిని రాబిన్‌సన్ ఓవర్‌లో ఔట్ చేశాడు. చివరికి కోహ్లీ, జడేజా బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు ఆటను ముగించారు.