తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కేసీఆర్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారని.. కానీ వాటిని పూర్తి చేయడంలో ఆయన విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు. దళిత ముఖ్యమంత్రి అనే హామీ ఏమైందని.. ప్రతి పౌరునికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్‌కి ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్‌లో మురళీధరన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది. 1,400 మంది విద్యార్ధులు ప్రాణాలు అర్పించింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు. సొంత కుటుంబంలో కూడా కేసీఆర్‌కి వ్యతిరేకత ఉంది. అది కూడ ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ సెప్టెంబరు 17న విముక్తి పొందింది. దానిని లిబరేషన్ డే చేస్తా అన్నాడు. కానీ, ఎంఐఎం, ఒవైసీకి భయబడి చేయడం లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ హామీలుగానే మిగిలిపోయాయి. మోదీ అన్నీ రాష్ట్రాలకు సమానంగా నిధులు అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రోడ్లు, డిజిటల్ కనెక్షన్ తదితరాల కోసం రూ.వేల కోట్లు ఇచ్చినా వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు  సీఎం కుటుంబానికి ఏటీఎంలాగా మారింది. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు రూ.1.30 లక్షల కోట్లకి ఎలా పెరిగింది? ఇందులో కమీషన్లు కేసీఆర్ కుటుంబానికి అందుతున్నాయి.’’


‘‘కాంగ్రెస్ అసమర్థత వల్ల 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది. ఆ తరువాత ప్రజలు బీజేపీ మీద విశ్వాసం ఉంచి నలుగురు ఎంపీలు, దుబ్బాక స్థానం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు. హుజూరాబాద్ ఎన్నిక కేసీఆర్‌కి ఒక వార్నింగ్ లాంటిది. ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఏడున్నర సంవత్సరాల తరువాత కేసీఆర్‌కి  దళితులు గుర్తు వచ్చారు. దళిత బంధుని బీజేపీ స్వాగతిస్తుంది. కానీ దళితులతో పాటు ఇతర కులాలలో ఉన్న వారికి కూడా రూ.10 లక్షలు ఇవ్వాలి.’’ అని మురళీధరన్ డిమాండ్ చేశారు.


తెలంగాణలో కులాల చైతన్యం ఎక్కువ: ఈటల
ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ.. ‘‘సామాజిక వర్గాల సమతుల్యతతో తొలిసారి మంత్రి వర్గ కూర్పు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 80 మంది మంత్రుల్లో 53 మందికి బడుగు బలహీన వర్గాల, మైనారిటీ వారికి అవకాశం కల్పించారు. వీరిలో 27 మంది ఓబీసీ, 5 మైనారిటీ, 12 మంది ఎస్సీ, 8 మందికి ఎస్టీలకు చోటు కల్పించారు. అన్నీ వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కూడా అణగారిన వర్గాల నిలయం. కానీ అన్ని వర్గాల సమతుల్యత ఈ రాష్ట్రంలో లేదు. 17 శాతం ఉన్న ఎస్సీల్లో ఒక్కరు మాత్రమే మంత్రిగా ఉన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో ఇక్కడ అవకాశం లేదు. మాటల్లో గొప్పగా, చేతల్లో అధఃపాతాళంగా ఉంది పరిస్థితి. తెలంగాణలో కులాల చైతన్యం ఎక్కువ. అన్నీ కులాల వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.’’ అని ఈటల అన్నారు.