కేరళలో నిఫా వైరస్‌ కేసు వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ సోకి మరణించినట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపింది.










చికిత్స తీసుకుంటూ..


కొజికోడ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకింది. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురై.. చికిత్స అందిస్తుండగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 


పరీక్షలు..


బాధిత బాలుడి నమూనాలను ముందే పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. వాటిని విశ్లేషించిన నిపుణులు నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. చిన్నారికి దగ్గరగా ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. కొజికోడ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.


నిఫా కలకలంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారం అందించేందుకు కేంద్రం తరఫున ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది. కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్‌ను గుర్తించారు. మొత్తం 23 కేసులను నిర్ధరించారు. 


Also Read: Covid 19 Cases India: దేశంలో 42 వేల కరోనా కేసులు నమోదు.. 308 మంది మృతి