Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు భారీగా వర్షం కురుస్తోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నేడు మరోసారి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం కురిసిన వర్షం నుంచే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు ఇంకా వరద నీటిలో ఉండిపోయాయి.
బంజారాహిల్స్, అమీర్‌పేట, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఖైరాతాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, చంపాపేట్, పాతబస్తీ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ ప్రజలను హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో ఎక్కడైనా సమస్య ఉంటే తమకు తెలపాలని 040 21111111 కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు. భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు చేరి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
Also Read: మరో అల్పపీడనం.. తెలుగు రాష్టాల్లో మళ్లీ కొన్ని రోజులు వర్షాలు
మూడు రోజులపాటు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య అరేరబియా సముద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 10న ఉత్తర అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన !
ఉత్తర అండమాన్ సముద్రంలో నేడు లేదా ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడినా దాని ప్రభావం తెలంగాణపై ఉంటుంది. రాగల 4, 5 రోజుల్లో ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఆదివారానికి తీవ్రమై నాలుగైదు రోజుల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపు వచ్చే అవకాశం ఉంది అధికారులు అంచనా వేశారు. తెలంగాణాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: అధికారులు తనిఖీలకొచ్చారని బార్లలోని మందుబాబులు పరార్ ! కానీ అసలు విషయం తెలిసిన తర్వాత...