Family Members Denied Funeral Of Mother In Suryapeta: అమ్మ.. ఈ సృష్టిలో ఓ గొప్ప పదం. బిడ్డలను నవమాసాలు మోసి కని ఎన్నో కష్టాలకోర్చి పెంచి వారు ఎదుగుతుంటే చూసి ఆనందిస్తుంది. అలాంటి అమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము. అయితే, వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారు కొందరైతే.. మరికొందరు ఆస్తుల కోసం వారిపైనే దాడికి పాల్పడిన ఘటనలు మనం చూసుంటాం.  ఆస్తి పంపకాల విషయంలో చెలరేగిన వివాదం.. అవి ఓ కొలిక్కి రాలేదని ఓ తల్లికి బిడ్డలు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. గత రెండు రోజులుగా ఆమె భౌతిక కాయం ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.


2 రోజులుగా ఇంట్లోనే భౌతిక కాయం


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామంలో వేము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా.. ఓ కుమారుడు ఇది వరకే మరణించాడు. ఆమె వద్ద రూ.21 లక్షల విలువైన ఆస్తి, 20 తులాల బంగారం ఉన్నాయి. తల్లి చనిపోయిందన్న వార్త తెలుసుకున్న ఇంకో కుమారుడు, కోడలు, కుమార్తెలు గ్రామానికి చేరుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియల విషయం పట్టించుకోకుండా ఆస్తి పంపకాల విషయమై వీరు గొడవ పెట్టుకున్నారు. గ్రామ పెద్దల దగ్గర ఆస్తి పంచాయతీ పెట్టుకున్నారు. గత రెండు రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉండగా.. ఓ కొలిక్కి రాలేదు.


అంత్యక్రియల ఖర్చు కోసం


లక్షమ్మ వద్ద ఉన్న రూ.21 లక్షల్లో వైద్య ఖర్చులకు రూ.6 లక్షలు పోగా.. మిగిలిన రూ.15 లక్షలు కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయితే, పంపకాలు సరిగ్గానే తేలినా.. కొడుకు చివరి క్షణంలో అంత్యక్రియల ఖర్చుపై ప్రశ్నించడంతో మళ్లీ వివాదం రేగింది. అంత్యక్రియలకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలని.. అలా జరిగితేనే తలకొరివి పెడతానని తేల్చిచెప్పాడు. దీంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. కొడుకు, కుమార్తెల మధ్య గొడవ నేపథ్యంలో ఫ్రీజర్ లోనే గత రెండు రోజులుగా తల్లి మృతదేహం ఉండిపోయింది. అయితే, ఆస్తి కోసం కన్నబిడ్డలే అమ్మ అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మమ్మ బతికుండగా.. అందరితో బాగానే ఉందని.. ఇప్పుడు ఆమె అంత్యక్రియలు ఇలా ఆస్తి గొడవలతో ఆగిపోవడం బాధగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.


Also Read: Telangana News: రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఏసీబీకి చిక్కారు - రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు