Telangana News: రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఏసీబీకి చిక్కారు - రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

Telangana ACB Raids: తెలంగాణలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరిని రెడ్ హ్యాండెండ్ గా అధికారులు పట్టుకున్నారు.

Continues below advertisement

Telangana ACB Raids in Bhadradri And Nalgonda Districts: తెలంగాణలో (Telangana) ఏసీబీ అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. లంచం తీసుకుంటున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వీరిలో ఒకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు విద్యుత్ శాఖకు చెందినవారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెంలో (Bhadradri Kothagudem) ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఎన్పీడీసీఎల్ ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అశ్వారావుపేటకు (Aswaraopeta) చెందిన రైతు కొనకళ్ల జనార్థన్ తనకు మద్దికొండలో ఉన్న పొలానికి విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం మీసేవా కేంద్రం ద్వారా రూ.లక్ష చలానా తీసి విద్యుత్ శాఖకు చెల్లించారు. అయితే, 2 నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించలేదు. మరో రూ.లక్ష లంచం ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ ఏఈ ధరావత్ శరత్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విసిగిపోయిన రైతు కుమారుడు ఆదిత్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వల పన్నారు. గురువారం సాయంత్రం స్థానిక పేపర్ మిల్లు సమీపంలో ఆదిత్య నుంచి ఏఈ శరత్ లంచం తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Continues below advertisement

నల్గొండ జిల్లాలో..

అలాగే, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం వనస్థలిపురానికి చెందిన రైతు రవిసూర్యనారాయణకు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. పొలానికి, ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి 2022లో డీడీలు తీసి చింతపల్లి సబ్ స్టేషన్ లో అందించారు. అనంతరం మల్లారెడ్డిపల్లిలోని ఆర్టిజన్ ఉద్యోగి నడింపల్లి వేణుకుమార్ ను సంప్రదించగా.. కనెక్షన్ ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. మొదట రూ.20 వేలు పని పూర్తైన అనంతరం రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఒప్పందం మేరకు గురువారం చింతపల్లిలోని సాయిబాబా దేవాలయం వద్దకు వస్తే డబ్బులిస్తానని వేణుకుమార్ ను రైతు రప్పించారు. అక్కడ రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వ్యవసాయ ఉద్యోగి సైతం

అటు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర క్యాంపు గ్రామానికి చెందిన వంగ నరేశ్.. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఎరువుల దుకాణం ఏర్పాటు చేసేందుకు ట్రేడ్ లైసెన్స్ కోసం ఈ ఏడాది మార్చిలో వ్యవసాయాధికారి అనిల్ కుమార్ కు దరఖాస్తు చేశారు. అయితే, ఈ ఆర్జీని ఉన్నతాధికారులకు నివేదించేందుకు సదరు ఉద్యోగి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా, నరేశ్ అప్పట్లోనే ఏసీబీని సంప్రదించగా.. ఉద్యోగి అనిల్ కదలికలపై నిఘా పెట్టారు. గురువారం నర్సాపూర్ లోని రైతు వేదికలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

టోల్ ఫ్రీ నెంబర్ ఇదే..

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే.. అది ఎక్కువా, తక్కువా అని ఆలోచించొద్దని.. తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola