Krishna Mukunda Murari Today Episode : ఆదర్శ్, మీరాల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి భవాని పంతుల్ని ఇంటికి పిలిపిస్తుంది. పెళ్లి బాధ్యతల్ని కృష్ణ, మురారిలకు అప్పగిస్తుంది. పెళ్లి అనగానే సందడి చేయాల్సిన కృష్ణ ప్రవర్తనలో ఏదో తేడాగా ఉందని అంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతున్నట్లు ఉందని రేవతి అనుకుంటుంది. 


ఆదర్శ్: తనలో తాను.. ముఖం ఎలా పెట్టిందో చూడు. అయినా కృష్ణకు నేను ఏడిస్తే సంతోషం కానీ నేను సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషంగా ఉంటుంది. నా పెళ్లి బాధ్యతను అమ్మ తనకే ఇచ్చింది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి. 


పంతులు వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందని చెప్తాడు. ఆ మాట వినగానే కృష్ణ, మురారిలు షాక్ అయిపోతారు. మిగతా అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అయితే వారం రోజులే ఉందని కాస్త కంగారు పడతారు. అయితే పంతుల్ని ఆ ముహూర్తం ఖాయం చేయమని అంటారు.


ఇక కృష్ణ, మురారి, ముకుంద  ఓ చోట కలిసి మాట్లాడుకుంటారు. ముకుంద కావాలనే పెళ్లి ఆపమని చెప్తుంది. కృష్ణ అనుకోకుండా ఇందులో ఇరుక్కుపోయామని లాక్కోలేక పీక్కోలేక అయిపోతున్నామని అంటుంది. 


ముకుంద: ఇప్పుడే ఏదో ఒకటి చేయండి.. లేదంటే పెళ్లి కూతురి కడుపులో మా బిడ్డ పుడుతుంది అని చెప్తారా.. అందుకే పెళ్లి ఆపాలి అని చెప్పలేరు కదా. అప్పుడు ఆదర్శ్‌ గారి పెళ్లి జరగడం ఇష్టం లేక కావాలనే ఈ పెళ్లి ఆపారని అందరూ అనుకుంటారు. అది అందరి దృష్టిలో కుట్ర కింద వస్తుంది. అందుకే చాలా తెలివిగా మీ మీద అనుమానం రాకుండా మీరే ఈ పెళ్లి ఆపండి.


కృష్ణ: ఈ పెళ్లి ఇష్టం లేదు అని నువ్వే ఒక్క మాట అనుంటే ఇంత వరకు వచ్చుండేది కాదు కదా.


ముకుంద: అదిగో మళ్లీ అదే అంటావ్. పెద్దావిడ నా కోసం ఎంత చేశారు. అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కోడల్ని చేసుకోవాలి అనుకుంటే కాదు అనగలనా. ఇప్పుడు ఏ కారణం చెప్పి కాదు అనాలి. అనాథవి ఇంత మంచి అదృష్టం వచ్చింది కోరి కోడల్ని చేసుకుంటే కాదు అంటే తిడతారు. అలా అని ఈ పెళ్లి కోసం నేను ఏదో ఆశ పడుతున్నాను అనుకోకండి. మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. హ్యాపీగా నేను మీ బిడ్డను కనిపెడతాను. అంతే కానీ నేను నా నోటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు అని రాదు.


మురారి: సరే మేం ఏదో చేస్తాం. నువ్వు టెన్షన్ పడకు బిడ్డకు మంచిది కాదు.


ఇక భవాని ఆదర్శ్‌ పెళ్లి గురించి తన ఫ్రెండ్స్‌కి కాల్ చేసి చెప్తుంది. రేవతి భవాని దగ్గరకు వచ్చి కృష్ణ డల్‌గా ఉందని చెప్తుంది. భవాని కృష్ణని మాట్లాడుతానని అంటుంది.  


కృష్ణ: నాకు ఎందుకో మీరా ఇదంతా కావాలనే చేస్తుందని అనిపిస్తుంది. 


మురారి: లేదు కృష్ణ మనం పెద్దమ్మ కోసం ఎలా నటిస్తున్నామో తనూ అలాగే నటిస్తోంది. 


కృష్ణ: నటిస్తుంది ఏసీపీ సార్ కానీ పెద్దత్తయ్య, ఆదర్శ్‌ల దగ్గర నటిస్తుందా మన దగ్గర నటిస్తుందా అనేదే నా డౌట్ అంతే. 


మురారి: మన బిడ్డను తన కడుపులో మోస్తుంది అది నిజం. నటన అంటావ్ ఏంటి. తను ఇంకా ధైర్యంగా ఉంది. ఆదర్శ్‌తో పెళ్లి జరిగిపోతుందని భయంతో నిజం చెప్పేస్తే అప్పుడు ఏం చేయగలం. అనవసరంగా మీరాని అనుమానించడం మానేసి తర్వాత ఏం చేయాలో అది ఆలోచిద్దాం. 


ఇంతలో కృష్ణను భవాని పిలుస్తుంది. పెళ్లి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఇంతలో మధు ఈవెంట్ మ్యానేజర్‌ని తీసుకొని వస్తాడు. అతడి పేరు పనిలేని సుధాకర్. ఇక భవాని బాగానే చేస్తున్నావ్ కదా మరి పనిలేదు అంటావ్ ఏంటి అంటే అది మా ఇంటి పేరు అని చెప్తాడు. కృష్ణ నవ్వితే భవాని కృష్ణని ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండమని అంటుంది. ఇక కృష్ణని దగ్గరుండి చూసుకోవడానికి మనుషుల్ని పిలిపిస్తున్నా అని చెప్తుంది. ఎవరో అని కృష్ణ రేవతిని ఆరా తీస్తుంది. రేవతి సస్పెన్స్ అని చెప్పదు. 


కృష్ణ: ఉన్నవాళ్లతోనే మ్యానేజ్ చేయలేకపోతే కొత్తవాళ్లా..


మురారి: మన జాగ్రత్తలో మనం ఉంటే ఏం జరగదులే.


అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆదర్శ్ రాలేదు ఏంటా అని భవాని అడిగితే ముకుంద ఇక్కడే ఉంది రాకుండా ఎక్కడికి పోతాడు అని మధు అంటాడు. ఇంతలో ముకుందకు వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటుంది. మురారి వెళ్లి ముకుందని పట్టుకుంటాడు. ఆదర్శ్‌ అప్పుడే కిందకి వచ్చి కోపంగా చూస్తాడు.


రజిని: ఇంకా ఏం తిననే లేదు అప్పుడే వాంతలు ఏంటి. మధ్యాహ్నం తిన్నది ఇంకా జీర్ణం కాలేదేమో.


కృష్ణ: అవి అజీర్ణం వచ్చిన వాంతులు కావు తన కడుపులో ఉన్న మా బిడ్డ వల్ల వచ్చిన వాంతులు. 


మురారి: ఇప్పుడు ఓకే కదా..


ముకుంద: ఓకే.. థ్యాంక్యూ మురారి గారు. మనసులో.. నీతో ఈ సేవలు అన్నీ చేయించుకొని నీకు దగ్గర కావాలి అనుకొనే మీ బిడ్డని నా కడుపులో పెట్టుకున్నాను మురారి. ఇకపై నేను కోరుకోవడం కాదు. నువ్వే కోరుకొని నా వెంట పడతావు. 


రజిని: ముకుంద వాంతులు చేసుకుంటే నేను ఇంకా కృష్ణ ఏమో అనుకున్నా. అదేంటో వాంతులు చేసుకోవాల్సిన కృష్ణ మామూలుగా ఉంది. నార్మల్‌గా ఉండాల్సిన ముకుంద గర్భవతిలా వాంతులు చేసుకుంటుంది. 


రేవతి: ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావ్. కడుపుతో ఉన్న వాళ్లు అంతా వాంతులు చేసుకోవాలి అని లేదు. వాంతులు చేసుకున్న వాళ్లంతా కడుపుతో ఉన్నట్లు కాదు.


రజిని: నేను అంత దూరం ఆలోచించలేదులే వదినా. అయినా వాంతులు చేసుకోగానే మురారి పరుగులు పెట్టగానే కృష్ణ అనుకున్నా. అందుకే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. 


ముకుంద: మనసులో.. అందరికీ అనుమానం వచ్చింది. ఇంకో రెండు సార్లు వాంతులు చేసుకుంటే కన్ఫ్మర్మేషన్‌కు వచ్చేస్తారు. 


సంగీత: ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ. కృష్ణ వాంతులు చేసుకుంటేనే పట్టుకోవాలా నేను చేసుకున్నా నువ్వు చేసుకున్నా బావ పట్టుకునేవాడు.


రజిని: నువ్వు నోరు మూసుకోవే. అన్నింటికి మధ్యలో దూరుతావు. 


ఆదర్శ్: ఏమైంది ముకుంద నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉండి ఎవరికీ చెప్పుకోలేకపోతే నాతో చెప్పుకోవచ్చు కదా. నేను చూసుకుంటాను. 


భవాని: మనసులో.. ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్ ఆదర్శ్‌కి మాత్రమే చెప్పే ప్రాబ్లమ్ అంటే ఏమీ అయి ఉండుంటుంది. కొంపతీసి ముకుంద కూడా తల్లి కావడం లేదు కదా. దానికి అదర్శ్‌ కారణం కాదు కదా. ఆదర్శ్‌ ముకుందని తీసుకొని మీదకు వెళ్లిపోతాడు. ఇక రజిని ఇంట్లో ఎవరు నెల తప్పారో నాకు అర్థం కావడం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్ : కవలలకు జన్మనిచ్చిన పంచమి.. కరాళి ప్రయత్నాలు విఫలం!