Telangana News: ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం మద్యం నుంచే వస్తుంది. అందుకే ప్రజలకు ఎంత మద్యం తాగిస్తే అంత ఆదాయం అంటూ సంబంధిత మద్యం శాఖ వారు ఇష్టానుసారంగా మద్యాన్ని మద్యం షాపులతో అమ్మిస్తుంటారు. దానికి తోడు ప్రతి చిన్న పల్లెలో సైతం అనధికార బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉంటాయి. ఆ బెల్టు షాపులు ఎక్కడున్నాయి, ఎవరు అమ్ముతున్నారనే విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా తమకేమి సంబంధం లేనట్టుగానే ఉంటారు. మంచినీళ్లు దొరకని గ్రామాల్లో కూడా బెల్టుషాపులు ఉంటాయనే సామెత గతంలోనే ఉంది. అలాంటిది అసలు తెలంగాణ పల్లెల్లో బెల్టుషాపులు ఉన్నాయా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ శాఖను ప్రశ్నించడం జరిగింది. 


ఏమేం అడిగారంటే?


తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపులు ఉన్నాయా, లేవా ఒకవేళ బెల్టు షాపులు ఉంటే ఏఏ జిల్లాలలో ఎన్ని షాపులు ఉన్నాయి. ఇప్పటి వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఎన్ని మద్యం షాపులపై రాష్ట్ర వ్యాప్తంగా జరిమానా విధించారు. ఎన్ని షాపులను సీజ్ చేశారు తెలపగలరని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బెల్టు షాపు కూడా లేదు..!


తాము అడిగిన ప్రశ్నకు ప్రతి జిల్లా ఎక్సైజ్ అధికారి సమాచారం పంపారు. రాష్ట్రంలోని పెద్దపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూల్, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిర్మల్, లక్ష్యెట్టిపేట, మంచిర్యాల, వరంగల్ రూరల్, బెల్లంపల్లి, అదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎక్సైజ్ అధికారులు తమ ప్రాంతంలో బెల్టు షాపులు నిర్వహించడం లేదు. ఎక్కడైనా బెల్టులు షాపులు ఉన్నాయని సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇచ్చారు.


Also Read:పుట్టినరోజు నాడే గుండెపోటుతో విద్యార్థి మృతి - డెడ్‌బాడీతో కేక్ కట్ చేయించిన పేరెంట్స్


Also Read: జీవో 111 రద్దు సాధ్యమేనా ? గత ఏడాది కేబినెట్ నిర్ణయం ఎందుకు అమలు కాలేదు ?