Somu Veerraju Meet Governor: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఈరోజు(మే 20, శనివారం) కలవబోతున్నారు. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే.. పోలీసులు దారుణంగా అడ్డుకున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అలాగే బీజేపీ ఓ.బీ.సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సురేష్ తలను కాళ్ల మధ్యలో నొక్కి పెట్టిన దారుణాన్ని చూశామని వివరించారు. ఇలాంటి దారుణాలను అడ్డుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పోలీసు దుశ్చర్యలను అనేక వేదికల పై ప్రస్తావించి, ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామన్నారు. పోలీసుల దమనకాండపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర  గవర్నరును కలుస్తామని ప్రకటించారు. 


నిన్న గన్నవరంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరంలో జరిగింది. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. రైతులకు భీమా సౌకర్యం లేకుండా నట్టేట ముంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. రైతులకు చిల్లులు పడిన గోనె సంచులు ఇవ్వడంలో ప్రభుత్వం మాఫియాను నడుపుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.


రాష్ట్రంలో రేషన్ మాఫియా... 


రేషన్ బియ్యం రీసైకిల్ చేసి వెయ్యి కోట్లు కుంభకోణం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మాఫియాలో అధికార పార్టీకి చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఎద్దేవా చేశారు.









జాతీయ రహదారుల కనెక్టివిటికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఆయా కాంట్రాక్ట్ పనులను మంత్రి అనుచరులకు కట్టబెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం అధికారులుపై ఒత్తిడి తీసుకువచ్చి, అవినీతి అక్రమాలకు కేంద్రంగా మంత్రులు మారుతున్నారని, అన్నీ తెలిసినప్పటికి అధికారులు సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.


బ్రాందీ మీదే మమకారం... 


రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీదనే ఎక్కువ ధ్యాస ఉందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్ పై రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని అన్నారు. బ్రాందీ మీద ఉన్న అవగాహన ఆయుష్ పై ముఖ్యమంత్రి జగన్ కి లేదన్నారు. సాంప్రదాయ వైద్య విధానం పై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేయడం లేదన్నారు. జగన్ బ్రాందీ షాపు ల్లో అంతా క్యాష్ ని వినియోగిస్తున్నారని, ఆ నగదు అంతా ఎక్కడికి వెళుతుందని సోము వీర్రాజు ప్రశ్నించారు.