తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎవడో పిచ్చోడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి లేఖ ఇచ్చాడంటూ మండిపడ్డారు. తనకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. నా రక్తం, వెంట్రుకలు, అవసరమైన ఇతర శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధమే.. ఇందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఎలాంటి డ్రగ్ అనాలిసిస్ టెస్టులకైనా తాను సిద్ధమేనని ప్రగతి భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇకనుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతామని హెచ్చరించారు. కనీసం అడ్రస్ లేని వ్యక్తులు సైతం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ తిడితే, ఆనాడు ఉద్వేగం ఉంది, ఇప్పుడు వీళ్లకు ఏం రోగం వచ్చిందని ప్రశ్నించారు. సైదాబాద్ సింగరేణి కాలనీ బాలిక హత్యాచార ఘటనపై చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. గతంలో దిశ ఘటన విషయంలో దేశం హర్షించిందని, తాము మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటామన్నారు. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి.. ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతోందన్నారు. క్రిమినల్స్ కు కేవలం ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసునంటూ కాంగ్రెస్ కీలక నేతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


Also Read: Ganesh Immersion: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం... శోభాయాత్రకు రూట్ మ్యాప్, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు


జానారెడ్డిని చిన్న పిల్లగాడు ఓడించాడు.. 
‘తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో మేము నిమగ్నమైంది. మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన నేతలు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. అయినా సరే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది. కాంగ్రెస్ నేత జానారెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా.. ఓ చిన్న పిలగాడు ఆయనను ఓడించాడు. అంటే టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది. గజ్వేల్ లో కాకుండా విపక్షాలు రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు ఐన వస్తాయా? కాంగ్రెస్ పార్టీలో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. భవిష్యత్తులో ఆ నేత పీసీసీ చీఫ్ పదవి కూడా అమ్ముకుంటారు’ అని కేటీఆర్ ఆరోపించారు.


Also Read: ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?


‘రూ.50 కోట్లకు పీసీసీ చీఫ్ పదవి అమ్మారని కాంగ్రెస్ నేతలే విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసు. వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు. అయినా ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలంగాణలో ఎంఐఎంకి భయపడుతున్నది బీజేపీ మాత్రమే. ఆదిలాబాద్‌కు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పిన  బీజేపీ ఏం చేసింది. మాటలు చెబుతున్న బీజేపీ సాయుధ పోరాటం చేసిన  నేతలకు పింఛన్లు అడిగినా ఇవ్వడం లేదు. తెలంగాణకు ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు గురించి అయినా హోం మంత్రి అమిత్ షా చెప్పారా?. ఢిల్లీ పార్టీలు సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నాయి. బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని’ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.


కొత్త పార్టీల నేతలు సైతం విమర్శలా..


వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్‌లపై సైతం విమర్శలు చేశారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, విద్యాలయాలు ఇవ్వకపోయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క మాట మాట్లాడటం లేదు. మరోవైపు కొత్త పార్టీలు సైతం సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో నిద్రపోతే దేశంలో ఎక్కడా లేని పథకాలు ఎలా అమలవుతున్నాయి. రాష్ట్రానికి రూ. 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. పని చేయకపోతే పెట్టుబడులు నిజంగా సాధ్యమేనా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?


దళిత బంధు 1990లోనే సిద్దిపేటలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో దళితులకు ఇలాంటి పథకం ఒక్కటైనా పెట్టారా.. అందరి బాగోతం తమ వద్ద ఉందని త్వరలోనే బయట పెడతామన్నారు. తెలంగాణ గురించి ఒక ఎంపీ మాట్లాడితే ఆయనను గాడిద అంటారా?. బీసీ బంధు కావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడుగుతున్నారు. ప్రధాని మోదీకి చెప్పి దేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు లక్షల రూపాయలు పంచాలని సూచించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం తమకు సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.