తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల సందడి కనిపిస్తోంది. అవి ఉపఎన్నికలు కాదు. నేరుగా అసెంబ్లీ ఎన్నికల సందడే కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఆ చర్చ జోరుగా సాగుతూండగా మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధపడుతున్నారా అన్న చర్చ ప్రారంభమయింది. వచ్చే ఏడాది నుంచి అందరం రోడ్ల మీద ఉండాల్సిందేనని సీఎం జగన్ మంత్రులకు తేల్చి చెప్పారు. వైఎస్ఆర్‌ సీపీకి గత ఎన్నికల్లో పని చేసిన పీకే టీం కూడా వచ్చే ఏడాది నుంచి పని చేయడం ప్రారంభిస్తుందని చెప్పడంతో ఇక జగన్ కూడా ముందస్తు ఆలోచనలో ఉన్నారన్న  నమ్మకం అధికార పార్టీలోనే కాదు ఇతర పార్టీల్లోనూ బలపడుతోంది. 


రెండున్నరేళ్లు కాక ముందే ఎన్నికలకు సీఎం జగన్ కసరత్తు !


మంత్రివర్గ సమావేశంలో అందరం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ వ్యాఖ్యానించడం మంత్రుల్ని కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. . ఆయన పీకే టీం గురించి కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం పని చేయడానికి వస్తుందని ఆయన  మంత్రులకు చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా ఎవరికీ స్ట్రాటజిస్ట్‌గా పని చేయడం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్ానారు. అయితే ఆయన టీం మాత్రం పని చేయడానికి రెడీగా ఉంది. ఆ టీంను రంగంలోకి దించాలని నిర్ణయించారు.


Also Read : ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ... 71వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ..


తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారా..? 


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు ముందుగానే జరుగుతాయి. 2019లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి 2018 ద్వితీయార్థంలోనే నిర్వహించారు. ఈ కారణంగా 2023 ద్వితీయార్థంలోనే జరుగుతాయి.  తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లే ఆలోచన సీఎం జగన్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగడాన్ని ప్రాంతీయ పార్టీలు కోరుకోవు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకోవు. అందుకే జగన్ మదిలోనూ ముందస్తు ఎన్నికల ఆలోచన ఉందన్న అభిప్రాయం చెబుతున్నారు. అంటే తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లినా అది ముందస్తు ఎన్నికలు అవుతాయి. 2023ద్వితీయార్థంలో అంటే..  పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడానికి అవకాశం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు మళ్లీ జరగకూడదనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.


Also Read : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !


తెలంగాణ సీఎం మరింత ముందస్తుకు వెళ్తే జగన్‌ కూడా వెళ్తారా..!?


అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఆలోచనలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఆరు నెలలు లేదా ఏడాది ముందుగానే ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇలా ఎన్నికలు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. అందుకే బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దళిత బంధు పథకం ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసమేనని భావిస్తున్నారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నాలుగు దిక్కులా నాలుగు మండలాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధు కోసం రూ. ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసి పథకం అమలు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సమయంలో  ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఆ ఎన్నికలతో పాటు జగన్ కూడా ముందస్తుకు సిద్ధమైతే ముందుగానే  ఏపీలోనూ ఎన్నికలు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also Read : బర్త్ డే స్పెషల్... ప్రధాని మోదీ తలపాగాల ప్రత్యేకత


కేంద్రమే జమిలీ ఎన్నికలకు వెళ్తుందా !? 


అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. జమిలీ ఎన్నికలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా సార్లు చెప్పారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనేది కేంద్రం విధానం. అయితే కేంద్రం చేయాల్సిన పనులన్నీ గుట్టుగా చేస్తోంది. నిర్వహించాలనుకుంటే ఎప్పుడైనా సిద్ధమవ్వొచ్చు. రాజ్యాంగ సవరణ చేస్తే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనే ఈసీ ప్రకటించింది. అందుకే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అంచనా వేసుకుంటున్నారు. 


Also Read : జగన్ గెలుస్తారా..? రఘురామ వదులుతారా.. ?