హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నిమజ్జన కార్యక్రమానికి విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో శోభాయాత్రకు రావాలని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు  చేసినట్లు మంత్రి తెలిపారు. భక్తులందరూ కొవిడ్‌ నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని కోరారు. ట్యాంక్‌ బండ్‌తో పాటు నగర శివారులో 14 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర వసతులు కల్పించామని నగర మేయర్‌ విజయలక్ష్మి అన్నారు. 


10 వేల సిబ్బంది


10 వేల మంది సిబ్బంది వేడుకల్లో 24 గంటలపాటు పనిచేయనున్నట్లు మేయర్ తెలిపారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద 33 క్రేన్లు, ఎన్టీఆర్‌మార్గ్‌లో 11 క్రేన్లు ఏర్పాటుచేశామన్నారు. నగరవ్యాప్తంగా 320 కి.మీ. మేర శోభాయాత్ర ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ తెలిపారు. శాంతిభద్రతలను కాపాడేందుకు 19 వేల పోలీసులు బందోబస్తు చేస్తారని పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించారు. 


ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు షురూ


ఖైరతాబాద్‌ ‘శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి’ నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు. మహాగణపతిని గణేష్‌ను తరలించడానికి ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన భారీ ట్రాలీని సిద్ధం చేశారు. దీనిపై ఇనుప కమ్మల వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. శనివారం బడా గణేష్‌ వద్ద షెడ్డు తొలగిస్తారు. దీంతో భక్తులు దూరం నుంచే మహాగణపతిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయం మహాగణపతికి భక్తులు వీడ్కోలు పలకనున్నారు. 


మహాలడ్డూ అందజేత


ఖైరతాబాద్‌ వినాయకుడికి సురుచి సంస్థ ఈ ఏడాది 100 కిలోల మహా లడ్డూను అందించింది. తాపేశ్వరానికి చెందిన సురుచి అధినేత మల్లిబాబు శుక్రవారం మహాలడ్డూను సమర్పించారు. మహాలడ్డూకు వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మల్లిబాబును సత్కరించారు. ఆదివారం లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.


విద్యుత్తు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు


గణేశ్‌ నిమజ్జన సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ట్యాంక్‌ బండ్‌ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం నగరంలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ కు తరలిస్తారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో సమస్యలొస్తే కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 79015 30966, 79015 30866 లకు ఫోన్‌ చేయొచ్చని అధికారులు తెలిపారు. 


వినాయక నిమజ్జానికి ట్రాఫిక్ ఆంక్షలు 


గణేశ్ నిమజ్జనం కారణంగా ఆదివారం భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ఆంక్షలు అమల్లో ఉంటాయి. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం ఉంటుంది. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లిస్తారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 


కంట్రోల్ రూములు ఏర్పాటు


వాహనాల దారి మళ్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోడానికి 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు తెలిపారు. గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటుచేశారు.  




గణేష్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలు 



  • బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్ కు వినాయక విగ్రహాల తరలింపు 

  • బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్  గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు

  • సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు

  • ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు

  • దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర 

  • టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు మళ్లింపు 

  • మెహదీపట్నం, తపచ్ బుత్రా, అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడా కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి. 

  • ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది. 

  • విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్  


బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు. 


Also Read: KRM GRMB Meet: కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాల భేటీ... ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం