తెలంగాణలో త్వరలో 430 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అఖిల భారత స్థాయిలో 430 వైద్య పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కాలేజీల్లో మెడికల్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
త్వరలోనే రామగుండంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా పోస్టులను మంజూరు చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 8 కాలేజీల్లో కలిపి మొత్తం 1,200 సీట్లు వచ్చే ఏడాదికి (2022- 23) అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ వైద్య కమిషన్‌కు 8 కాలేజీలను నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయనున్నారు.
172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ..
తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖలో 172 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్త ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానుండగా... గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కావడంతో అభ్యర్థులు కబడ్డీ, హాకీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్‌బాల్ తదితర క్రీడల్లో రాణించి ఉండాలి.
డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయోపరిమితిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉన్నాయి. జనరల్, బీసీ క్రీమీలేయర్ అభ్యర్థులు రూ.800.. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.