భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైన తర్వాత టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తేలిపోయే సమయం వచ్చిందన్న విశ్లేషణలు వినిపించాయి. టీఆర్ఎస్‌పై తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్నంత డైరక్ట్ ఎటాక్ చేస్తే ఇక తాడో పేడో తేల్చుకుంటారని .. సాఫ్ట్ కార్నర్ చూపిస్తే కేసీఆర్ ఢిల్లీ పర్యటన వర్కవుట్ అవుతుందని బీజేపీ కాస్త తగ్గినట్లేనని అనుకున్నారు. అమిత్ షా తెలంగాణకు వచ్చారు . వెళ్లారు. కానీ టీఆర్ఎస్‌ను కానీ కేసీఆర్‌ను గట్టిగా విమర్శించిన దాఖలాలు కనిపించలేదు. అమిత్ షా తన ప్రసంగంలో మజ్లిస్‌నే టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే తెలంగాణలో చర్చనీయాంశం అవుతోంది.
రాష్ట్ర నేతల స్థాయిలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయని అమిత్ షా !
తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ ప్రత్యర్థా.. మిత్రపక్షమా అన్న గందరగోళం సృష్టించడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉన్నారు. బీజేపీ పట్టు పెంచుకుంటోందన్న అభిప్రాయం కలిగిన ప్రతీ సారి ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రుల్ని... బీజేపీ పెద్దల్ని కలుస్తారు. తెలంగాణలో బీజేపీ - టీఆర్ఎస్ భాయి..భాయి అనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇక తెలంగాణ పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులతో అధికారికంగా ప్రశంసలు పొందుతూ ఉంటారు. దీంతో ఆ ప్రచారానికి మరింత ఊపు వస్తుంది.ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి బీజేపీతో టీఆర్ఎస్‌కు స్నేహమే లేదు అంతా లడాయేనని చెప్పుకోవడం తెలంగాణ బీజేపీ నేతలకు పెద్ద టాస్క్ అయిపోయింది. అందుకే నిర్మల్ సభ ద్వారా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ విమోచనకు బీజం పడిందని సంకేతాలు పంపాలని అనుకున్నారు. కానీ అమిత్ షా సభలో జరిగింది వేరు. ఆయన ప్రసంగించి వేరు. చేసిన రాజకీయం వేరు.
Also Read : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు !?
మజ్లిస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా ఫోకస్ చేసిన అమిత్ షా !
కేంద్రహోంమంత్రి అమిత్ షా పూర్తి స్థాయి మజ్లిస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. మజ్లిస్‌కు అనుబంధంగా టీఆర్ఎస్‌ను విమర్శించారు కానీ నేరుగా కేసీఆర్‌పై చేసిన విమర్శలేమీ లేవు. ఆయన కుటుంబ పాలన చేస్తున్నారన్న రొటీన్ ఆరోపణ చేసి అమిత్ షా సరి పెట్టారు. కానీ మజ్లిస్‌పై మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి భయపడబోమని అన్నారు. మజ్లిస్‌ను చూసి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. ఆయన ప్రసంగంలో టీఆర్ఎస్‌పై అక్కడక్కడా విమర్శలు గుప్పించినా అది కేవలం మజ్లిస్ కోణంలోనే సాగింది కానీ తెలంగాణ అధికార పార్టీగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది లేదు . అధికారంలోకి వస్తామన్నారు .. ఆ ప్రకటన కూడా మజ్లిస్ కోణంలోనే ... భయపడకుండా విమోచన దినం చేస్తామన్నారు కానీ ఇంకెలాంటి అభిప్రాయం కల్పించలేదు. దీంతో బీజేపీ క్యాడర్ కూడా అయోమయానికి గురి కావాల్సి వచ్చింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?
తెలంగాణ బీజేపీ నేతలకు టీఆర్ఎస్‌పై పోరాటం విషయంలో క్లారిటీ వచ్చిందా ?
తెలంగాణ బీజేపీ నేతలు టీఆర్ఎస్‌తో తాడో పేడో అన్నంతగా పోరాడుతున్నామని ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ దారుణమైన అవినీతికి పాల్పడుతోందని కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌తో పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తారని లేకపోతే వచ్చిన ఊపు తగ్గిపోతుందని తెలంగాణ బీజేపీ నేతల ఆందోళన. అందుకే బండి సంజయ్ ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా ఢిల్లీ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఫీలింగ్ కల్పిస్తూ వీరి పోరాటాన్ని తేలిక చేస్తోంది. దాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. చివరికి అమిత్ షాను పర్యటనకు ఒప్పించి తీసుకొచ్చినా కేసీఆర్‌ను కాకుండా ఎంఐఎంను టార్గెట్ చేయడంతో టీ బీజేపీ నేతలకు నీరసం వచ్చినట్లయింది.
Also Read : శశిథరూర్‌పై రేవంత్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !
జాతీయ రాజకీయాల కోసమే టీఆర్ఎస్‌పా సాఫ్ట్‌కార్నరా ?
బీజేపీ హైకమాండ్ జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో నొప్పింప.. తానొవ్వక అనే పద్దతిలో రాజకీయం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. అయితే అలా బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్‌తోనూ కలవని బలమైన పార్టీలు కొన్ని ఉన్నాయి. పేరు అలా ఉన్నా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయి. బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ అలాంటి పార్టీల్లో ముఖ్యమైనవి. ఈ పార్టీల విషయంలో వీలైనంత వరకూ జాతీయస్థాయిలో సాఫ్ట్‌గా ఉండాలన్న ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉటుందో చెప్పలేరు. బీజేపీకి మిత్రపక్షాలు కూడా బాగా తగ్గిపోయారు. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు బలమైన పార్టీలు లేవు. అందుకే తెలంగాణలో అదే పద్దతి పాటిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితే.