బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని బండి సంజయ్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది.


తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను.. క్వాష్ చేయాల్సిందిగా.. బండి సంజయ్ తరఫు న్యాయవాది.. ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్రమ కేసులతో పలు రకాల సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇదంతా కావాలనే చేశారని.. ఇందులో ప్రభుత్వ దురుద్దేశంగా ఉందని.. న్యాయస్థానానికి.. ప్రకాశ్ రెడ్డి చెప్పారు. మేజిస్ట్రేట్ జ్యూడిషియల్‌ కస్టడీ 14 రోజులు సరైంది కాదని పేర్కొన్నారు.


విచారణ సందర్భంగా.. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాత్రి 10.50 గంటలకు అరెస్టు చేస్తే.. 11.15 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పేర్కొంది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా 333 సెక్షన్‌ను ఎందుకు చేర్చారో వివరణ ఇవ్వాలని తెలిపింది. తోపులాటలో పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారని.. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసుల గాయాలపై ఎలాంటి మెడికల్‌ రిపోర్టులు అందించలేదని తెలిపింది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు బండి సంజయ్‌ రిమాండ్‌పై స్టే విధించిన ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్‌, మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్‌ సహా ఆరుగురిని ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించి.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకుని ఆస్తినష్టాన్ని కలిగించారని, ఇందుకు సంజయ్‌తోపాటు మరికొందరు కారణమని కరీంనగర్‌ రెండో ఠాణా పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతోపాటు గతంలో ఈయనపై ఉన్న 10 కేసులనూ రిమాండ్‌ నివేదికలో ప్రస్తావించారు. కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. దీంతో సంజయ్‌ని కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు.


ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారంటే..
సీసాలు, కర్రలతో గాయపరచడమే కాకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి సుమారు రూ.20 వేల ఆస్తి నష్టం కలిగించారని, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్వహించే సమావేశంలో సభ్యుడిగా ఉన్నారంటూ ఐపీసీ సెక్షన్‌ 143, శాసన సమ్మతంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ సెక్షన్‌ 188, అక్రమంగా ఒక వ్యక్తిని నిరోధించారని సెక్షన్‌ 341, ప్రజాసేవలో ఉన్న ఉద్యోగి విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ సెక్షన్‌ 332, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారంటూ సెక్షన్‌ 333లను బండి సంజయ్‌పై నమోదు చేశారు. అందరూ కలిపి నేరం చేశారని సెక్షన్‌ 149, జాతీయ విపత్తు చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని సెక్షన్‌ 51(బి), ప్రజాఆస్తులను ధ్వంసం చేశారని సెక్షన్‌ 3లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.


Also Read: TRS Vs BJP: జేపీ నడ్డాను ఉరికించి కొడతాం, చిల్లర మాటలు మాట్లాడితే ఉన్నదీ పోతుంది: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు


Also Read: Counsellor Vs Minister: ఆ మంత్రి నన్ను హత్య చేయించేస్తాడు.. టీఆర్ఎస్ నేత సంచలనం, హెచ్చార్సీ వద్దకు..