Constable Suspends Who Drag ABVP Woman Leader by Hair: ఇటీవల ఏబీవీపీ (ABVP) రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనలో కానిస్టేబుల్ పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ జరిపించగా.. ఆ నివేదిక ఆధారంగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లలో ఒకరిని సస్పెండ్ చేశారు. మరో కానిస్టేబుల్ కు మెమో జారీ చేశారు. ఈ మేరకు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 


ఇదీ జరిగింది


ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్శిటీ భూములు హైకోర్టుకు కేటాయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 55 జారీ చేసింది. ఈ ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఈ నెల 25న పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వారికి మద్దతు పలికేందుకు ఏబీవీపీ నాయకులు యూనివర్శిటీకి వెళ్లారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. హోండా యాక్టివాపై వెళ్తూ ఏబీవీపీ మహిళ నేత ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. దీంతో ఆమె కింద పడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అటు, జాతీయ మానవ హక్కుల సంఘం సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.






ప్రభుత్వానికి NHRC నోటీసులు


మరోవైపు, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా.. సుమోటోగా స్వీకరించి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితితో పాటు ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు, ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులైన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి  ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థినిని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లడం అమానుషమని మండిపడింది. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. 


Also Read: Shiva Balakrishna News: శివ బాలృష్ణ ఉద్యోగానికి ఎసరు- తొలగింపుపై ప్రభుత్వం చర్చలు